We Miss యద్ధనపూడి సులోచనారాణి గారు!!!

ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అమెరికాలో మరణించారు. కాలిఫోర్నియాలోని కుమార్తె నివాసంలో ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. సులోచనా రాణి మరణించిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా కాజా గ్రామంలో జన్మించారు. భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు ప్రధానాంశంగా ఆమె నవలలు, కథలు రాశారు. గత కొన్నేళ్లుగా ఆమె రచనలకు దూరంగా ఉంటున్నారు. చదువుకునే పిల్లలకు సాయం చేయడం, మానసిక సమస్యలు ఉన్న పిల్లల కోసం ఆమె ఓ పాఠశాల నడుపుతున్నారు.

అగ్నిపూలు, మీనా, విజేత, బహుమతి, బంగారు కలలు, అమరహృదయం, మౌన తరంగాలు, సెక్రటరీ తదితర నవలలు రాశారు. ఆమె రచనలు సినిమాలుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి. ఆమె రచనల్లో మధ్యతరగతి మహిళల పట్ల ప్రేమ, ఆప్యాయతలు కనిపిస్తాయి. సగటు మహిళ జీవితం ఆధారంగా ఆమె రచనలు సాగాయి. ఆమెకు శైలజ మాత్రమే ఏకైక సంతానం. సెక్రటరీ నవలను గర్భవతిగా ఉండగానే సులోచనారాణి రాశారు.

సులోచనారాణి సినిమాలకు కూడా కథలను అందించారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు ఆమె కథ అందించారు. సులోచనా రాణి రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు సినిమాలుగా వచ్చాయి.

ప్రముఖ సీరియల్స్ గా పేరు తెచ్చుకున్న, మంజులనాయుడు దర్శకత్వం వహించిన చక్రవాకం, మొఘలిరేకులు, శ్రవణసమీరాలు మూల కథలను అందించినవారు కూడా సులోచనరాణి గారే.