‘నా నువ్వే’ ఎలా ఉందో???

తన తొలి తొలి సినిమాల నుంచినే మాస్ బాట్ పట్టిన హీరో కల్యాణ్ రామ్. ‘అతనొక్కడే’తో తొలి హిట్ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత కాలర్ నలగకుండా విలన్ల తుప్పురేగ్గొట్టే సగటు తెలుగు హీరో పాత్రలనే చేస్తూ వచ్చాడు. వాటిల్లోనే కొన్ని రకాల ప్రయోగాలు చేశాడు. అప్పుడప్పుడు హిట్లు, కొన్ని ఫ్లాప్‌లతో కల్యాణ్ రామ్ కెరీర్ను కొనసాగిస్తూ వచ్చాడు. అయితే మాస్ పాత్రల్లో ప్రయోగాలు చేసిన ఈ హీరో చాలా కాలం తర్వాత పక్కా లవర్ బాయ్‌గా మారాడు. ఈ విధంగా తన లక్‌ను పరీక్షించుకోబోతున్నాడు.

‘నా నువ్వే’తో రేపు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఈ హీరో. వాస్తవానికి ఈ సినిమాకు అనుకున్నంత బజ్ రాలేదు. మామూలుగా కల్యాణ్ రామ్ సినిమా వస్తోందంటే.. ఒక అంచనాలుండేవి. అయితే ఈ సారి ఇతడు పూర్తిగా రూటు మార్చడంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఇంకా పూర్తిగా రీచ్ కాలేదు. అయితే కాలేజ్ స్టూడెంట్స్, మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కొంత వరకూ కనెక్ట్ అయ్యింది. వీరే రేపు ఓపెనింగ్స్. ఆ తర్వాత ఈ సినిమాను మౌత్ టాక్ రక్షించే అవకాశం ఉంది.

‘నా నువ్వే’దర్శకుడు జయేంద్ర. యాడ్ మేకర్‌గా పేరున్న వ్యక్తి. కొన్నేళ్ల కిందట సిద్ధార్థ్ హీరోగా రూపొందించిన ‘180’ సినిమాతో సినీ దర్శకుడు అయ్యాడితను. ఆ సినిమా బాగానే ఉందనిపించుకుంది, కానీ ట్రాజెడీ కావడంతో కమర్షియల్‌గా హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో విరామానంతరం కల్యాణ్ రామ్ వంటి మాస్ హీరోను లవర్ బాయ్‌గా చూపుతూ ఈ దర్శకుడు కొత్త సబ్జెక్ట్‌తో వచ్చాడు. తమన్నాతో హీరో రొమాన్స్‌ను టీజర్‌గా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తన రూటు పూర్తిగా మార్చేసి, జయేంద్ర వంటి దర్శకుడితో కల్యాణ్ రామ్ ఈ సినిమా చేశాడంటే ఇందులో ఏదో విషయం ఉండాలి. ఆ విషయం ఏంటో రేపు ఈ పాటికి తెలిసే అవకాశం ఉంది.