‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో రకుల్‌ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ సినిమాలోకి మరో స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో నందమూరి బాల‌కృష్ణ‌తో పాటు విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ తదితరులు నటిస్తుండగా, తాజాగా ఈ జాబితాలోకి స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ కూడా చేరింది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌.. ఇటీవల మొదలైన విషయం తెలిసిందే.

సినిమాలోని కీలక సన్నివేశంలో రానున్న పాట కోసం చిత్ర యూనిట్ రకుల్‌ప్రీత్ సింగ్‌ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్టీఆర్‌ సినిమాల్లోని చాలా ఐటెమ్‌ సాంగ్స్ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. దీంతో, ఏ పాటని రకుల్‌ప్రీత్ సింగ్ కోసం ఈ సినిమాలో కేటాయించారో చిత్రం విడుదల వరకూ సస్పెన్స్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. స్టార్స్‌‌ చేరికతో ఎన్టీఆర్‌ సినిమా‌పై అంచనాలు పెరిగిపోతుండగా, చిత్ర యూనిట్ ఆశించిన దానికంటే ఎక్కువగానే ప్రచారం లభిస్తోంది.