"హలో" సినిమా రివ్యూ

చిత్రం: హలో
రేటింగ్: 2.0/5.0
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : విక్రం కె కుమార్
నిర్మాత: నాగార్జున అక్కినేని

స్టారింగ్ : అఖిల్ అక్కినేని, కల్యాణి ప్రియదర్శన్, జగపతిబాబు, రమ్య కృష్ణ, అజయ్ తదితరులు...

"అఖిల్" సినిమాతో ఎంట్రీ భారీగా ఇచ్చినా ఫలితం ఆశించినంత రాకపోవడంతో డీలా పడిన అఖిల్ తిరిగి మరింత తనదైన ఫర్ఫార్మెన్స్ తో మనందరిని అలరించడానికి ఈ సారి మళ్ళీ కొత్తగా "హలో" చెబుతూ ఈ శుక్రవారం మన ముందుకు వచ్చాడు. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం చాలా బాగున్నాయని, యాక్షన్ సన్నివేశాలలో అఖిల్ బాగా చేసాడని, తను తండ్రిగా కాకుండా మాములు ప్రేక్షకుడిగా ఇది చాలా మంచి సినిమా, చూడండి అని నాగార్జున గట్టిగా చెప్పడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
శీను(అఖిల్) అనాథ కావడంతో వీధుల్లో తిరుగుతూ ఓ పార్క్ లో ఉంటుంటాడు. అదే పార్కుకు వచ్చిన జున్ను(కళ్యాణి)తో శీనుకు పరిచయమయ్యి అది పెరిగి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అనుకోకుండా జున్ను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతుంది, వెళ్లిపోతూ తనకు ఫోన్ చేయమని శీనుకి వంద రూపాయల నోటు మీద ఫోన్ నంబర్ రాసిస్తుంది. కానీ శీను దాన్ని పోగొట్టుకుంటాడు. ఓ యాక్సిడెంట్ లో శీనుకు సరోజిని(రమ్యకృష్ణ), ప్రకాష్(జగపతిబాబు) దంపతులకు దగ్గరవుతాడు. అతడిని దత్తత తీసుకొని అవినాష్‌గా పేరు మార్చి ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు. అలా అవినాష్‌గా మారిన శీను మాత్రం జున్నును మర్చిపోడు. తనకోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. మరి శీనుకి తన జున్ను దొరికిందా? ఆమెను ఎలా కనిపెట్టగలిగాడు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
అఖిల్ నటన పరంగా కంటే డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. ముఖంలో కొన్ని హావభావాలు సరిగ్గా పలికించలేకపోయాడు. యాక్షన్ సీన్స్‌లో అతడి కష్టం తెరపై కనిపిస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ అనే ఫీలింగ్ కలిగించలేకపోయింది. కొన్ని చోట్ల ఎమోషన్స్ పలికించడానికి ఇబ్బంది పడింది. రమ్యకృష్ణ, జగపతి బాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు.

సాంకేతికపరంగా...
టెక్నికల్‌గా సినిమా విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన బలం. పాటలు కూడా మెప్పిస్తాయి. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్ వర్క్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

విశ్లేషణ...
ప్రేమకథకు యాక్షన్ మిక్స్ చేసి దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. విక్రమ్ తెరకెక్కించే ప్రతి సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ సినిమా మొత్తాన్ని నడిపిస్తుంది. ఇదే ఆయన సినిమాలో ప్రత్యేకత. కానీ ‘హలో’ సినిమాలో ఆ మ్యాజిక్ ఎక్కడా కనిపించదు. స్టోరీ లైన్ పాతదే అయినప్పటికీ ఈ తరం యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను రూపొందించడానికి ప్రయత్నించారు. హీరో, హీరోయిన్‌ను ఎలా కలుస్తాడనే క్యూరియాసిటీను ప్రేక్షకుల్లో కలిగించలేకపోయారు. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా ఓకే అనిపిస్తుంది.

నచ్చినవి...
సంగీతం
యాక్షన్ సీన్స్

నచ్చనివి...
ఎడిటింగ్

చివరగా...
హిట్ ఇంకా అఖిల్ కు "హలో" చెప్పలేదు