"శివలింగ" సినిమా రివ్యూ

చిత్రం : శివలింగ
రేటింగ్‌ : 1.0/5.0
బ్యానర్‌ : అభిషేక్ ఫిలింస్
సంగీతం : తమన్
దర్శకుడు : పి వాసు
విడుదల : ఎప్రిల్ 14, 2017

స్టారింగ్‌ : లారెన్స్, రితికాసింగ్, శక్తి వాసు, వడివేలు, ప్రదీప్ రవత్, ఊర్వసి, జయప్రకాష్ వి, రాధా రవి, విటివి గణేష్ తదితరులు...

శివలింగ సినిమా కన్నడలో గతేడాది సూపర్ హిట్ అయిన చిత్రం "శివలింగ" ఇప్పుడు అదే "శివలింగ" పేరుతో తెలుగులో ఈ చిత్రం రీమేక్ అయ్యింది. ఇది రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.లారెన్స్ థ్రిల్లర్స్ అయిన గంగలా ఈ సినిమా ఉందో లేదో రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
రహీమ్ అనే ఓ వంటవాడు ట్రైన్ లో హత్యకు గురవుతాడు. అయితే చూడటానికి అతడి మరణం ట్రైన్ నుండి దూకి ఆత్మహత్యకు గురైనట్లు ఉంటుంది. అతడు హత్యకు గురైనట్లు ఆధారాలు లేక పోవడంతో ఆత్మహత్యగానే కేసు క్లోజ్ చేస్తారు. అయితే రహీమ్ ప్రియురాలు. రహీమ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అంటూ, పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసి కేసు రీ ఓపెన్ చేయిస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సమర్థుడైన సీబి సీఐడి ఆఫీసర్ శివలింగ(రాఘవ లారెన్స్)కు అప్పజెబుతారు. రహీమ్ హత్య కేసు తన చేతికి రావడం, అదే సమయంలో శివలింగకు సత్యభామ(రితికా సింగ్)తో పెళ్లి దాదాపు ఒకేసారి జరుగుతుంది. తనను ఎవరు? ఎందుకు చంపారో? తెలుసుకోవడానికి రహీమ్ ఆత్మ పరితపిస్తుంది. శివలింగ భార్య సత్య శరీరంలోకి ప్రవేశించి త్వరగా కేసు సాల్వ్ చేయాలని, అప్పటి వరకు నీ భార్య శరీరంలోనే ఉంటానని బ్లాక్ మెయిల్ చేస్తుంది రహీమ్ ఆత్మ. తన భార్యను కాపాడుకోవడానికి శివలింగ ఏం చేసాడు? ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసును ఎలా సాల్వ్ చేసాడు? అనేది తర్వాతి కథ.

నటీనటుల ఫర్ఫార్మెన్స్‌...
సీబీ సిఐడి ఆఫీసర్ పాత్రలో రాఘవ లారెన్స్ అదరగొట్టాడు. పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా, యాక్షన్ పరంగా ఎక్కడా వంకపెట్టడానికి లేదు. గురు సినిమాలో బాక్సర్ గా కనిపించి రితిక సింగ్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపించింది. అయితే హారర్ సన్నివేశాల్లో రితిక సింగ్ అంతగా ఆకట్టుకోలేదు. ఆయా సీన్లలో రితిక హావభావాలు పర్ఫెక్టుగా లేవు. రహీమ్ ఆత్మ పాత్రలో శక్తి బాగా నటించాడు. శివ లింగ తల్లి పాత్రలో ఊర్వశి, కామెడీ దొంగ పాత్రలో వడివేలు, రాధారవి, భానుప్రియ, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు ఓకే.

సాంకేతికపరంగా...
హారర్, కామెడీ, యాక్షన్.... ఇలా సీన్లు అల్లుకుంటూ దర్శకుడు సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తూ.... పాత కాన్సెప్టునే ఫాలో అయ్యాడు. ఎంతసేపూ పాత కాన్సెప్టు తరహాలోనే ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంపైనే దృష్టి పెట్టారే తప్ప కథ, కథనం విషయంలో సరైన జాగ్రత్త తీసుకోలేదు. పి. వాసు దర్శకత్వ లోపం అని చెప్పలేం కానీ కథ, కథనం, రొటీన్ కాన్సెప్టును ఆయన ఎంచుకోవడమే మైనస్. తమన్ అందించిన సంగీతం యావరేజ్ గా ఉన్నా.... బ్యాగ్కౌండ్ స్కోర్ బావుంది. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువులు బావున్నాయి. సురేష్ ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది. హారర్ సీన్లలో గ్రాఫిక్స్ ఓకే.

విశ్లేషణ...
లారెన్స్ ఇంట్రడక్షన్ బావుంది. యాక్షన్ సీన్ తోపాటు.... చిన్న కబాలి అంటూ సాగే పాటతో లారెన్స్ ఎంట్రీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాంచన, చంద్రముఖి హీరో- డైరెక్టర్ కాంబినేషన్ కావడంతో అంతకు మించి ఊహించుకుని ప్రేక్షకులు థియేటర్ కు వెళతాడు. రోటీన్ హారర్-కామెడీకు భిన్నంగా ఇంకా ఏదైనా కొత్తగా ఆశిస్తాడు. అయితే ‘శివలింగ'లో అలాంటిదేమీ కనిపించదు. ఇంతకు ముందే వచ్చిన ఏదో పాత హారర్ కామెడీ సినిమా చూసిన ఫీలింగే కలుగుతుంది.

నచ్చినవి...
లారెన్స్ పెర్ఫార్మెన్స్
బ్యాగ్రౌండ్ స్కోర్
క్లైమాక్స్

నచ్చనివి...
రితిక సింగ్
రొటీన్ కథ, కథనం

చివరగా..
సినిమా కొత్తదే కానీ పాత కథే