వివేక ఓటమి.. వైఎస్‌ జగన్‌కు అతి పెద్ద షాక్‌

ఇంత కాలం కడప జిల్లాలో వైఎస్‌ కుటుంబానికి తిరుగు లేకుండా సాగింది. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నాడు. అధికార టీడీపీ వైకాపాను తొక్కేస్తూ కడపలో పాగా వేస్తూ వచ్చింది. తాజాగా వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగు దేశం పార్టీ అభ్యర్ది రవి భారీ విజయాన్ని సొంతం చేసుకుని కడప జిల్లాలో టీడీపీ మరింత బలాన్ని పెంచుకుంది.

వైకాపాకు పూర్తి స్థాయి బలం ఉన్నా కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు తెలుగు దేశం వైపు మొగ్గారు. వైకాపాకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు తెలుగు దేశం వెంట నిలవడంతో జగన్‌ బాబాయి అని వివేకనంద రెడ్డికి ఓటమి తప్పలేదు. కడప జిల్లాలో వైకాపాకు ఇది అతి పెద్ద షాక్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సమయంలో వైకాపా అభ్యర్థిని సొంత జిల్లాలోనే జగన్‌ గెలిపించుకోలేక పోయాడు అనే అపవాదుతో ప్రతిపక్ష నేతకు పెద్ద షాక్‌ తగిలింది. తెలుగు దేశం పార్టీ ఈ విజయాన్ని చంద్రబాబు ప్రభుత్వ విజయంగా అభివర్ణిస్తున్నారు.

కడపలో వైఎస్‌ ప్రాభవం తగ్గిందని, ఇకపై ముందు ముందు కూడా మరిన్ని ఓటములు చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్బంగా తెలుగు దేశం పార్టీ నాయకత్వం అంటుంది. ఈ ఓటమి నుండి జగన్‌ గుణపాఠాలు నేర్చుకోవాలంటూ స్వయంగా వైకాపా నేతలు అంటున్నారు. తెలుగు దేశం విజయంపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ అనైతిక విజయం ఇది, అక్రమాలకు పాల్పడి గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.