వినాయక ఆకారం -- విశ్లేషణ

వినాయక ఆకారం చూడగానే మనస్సును ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఐతే ప్రతి విషయానికి ఎంతో విశేషార్ధం ఉండేలా మన పూర్వికులు వినాయకునికి ఈ ఆకారాన్ని సూచించారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా!

అతి పెద్దదయిన తల -- గణేశుని తల ఏనుగుది. అటు బలమైన కార్యాలను, ఇటు బుద్ధికి సంబంధించిన కార్యాల్నీ రెండింటిని నిర్వహించగల సామర్థ్యం గల ఏకైక జీవి ఏనుగు. అటువంటి ఏనుగు తలను ధరించిన గణపతి పెద్దగా ఆలోచించమని, బుద్ధి భావాలకు చక్కని ప్రతీక.
అతి పెద్ద చెవులు--- గణేశుడి చెవులు పెద్దవి, కళ్ళు చిన్నవి. ఎంతటి చిన్న విషయాల్ని అయినా పెద్ద చెవులతో వినాలని ఆయన చెవులు చెప్తుంటే,
అతి చిన్న కన్నులు--- కామానికి మూలమైన కళ్లు చిన్నవిగా ఉండాలని, జన్మ పరంపరల్ని ఆపాలంటే కళ్లను ఎక్కువ సమయం తెరిచి ఉండకుండా ధ్యానముద్రలో మూసి ఉంచాలని కళ్ళు చెప్తుంటాయ. దృష్టి నిశితం గా ఉండాలి, ఏకాగ్రతగా ఉండాలి.
ఉదరం--- ఇక విఘ్నేశ్వరుని ఉదరం బహు పెద్దది. మనిషి దీర్ఘాయువుగా ఉండాలంటే పొట్ట పెద్దదిగా ఉండాలని పతంజలి యోగ శాస్త్రం నిర్ధేశిస్తుంది. పెద్ద పొట్టను - సృష్టి రహస్యాల్ని, యోగ రహస్యాల్ని దాచే పరికరంగా చెప్పారు.
పాదాలు--- నిత్యకర్మాచరణాన్ని అనుసరించే ఎవరైనా మన చరణాలకు నమస్కరించడం జరుగుతుందని చెప్పడానికే వినాయకుని పాదాలు చిన్నవిగా ఉంటాయి. ఇవి చిన్నవే అయినా ముమ్మార్లు భూప్రదక్షిణం చేశాయని పురోహితులు చెబుతున్నారు.
నోటిని కప్పుతూ ఉన్న తొండం--- నీ మాటలను అదుపులో ఉంచుకో అని ఆత్మాభిమానానికి గుర్తుగా.
ఒక విరిగిన దంతం, ఏకదంతం--- సర్వదా మంచిని నీతో ఉంచుకుని చెడును విరిచి పడేసే ప్రయత్నం చేయి.
వంపుతిరిగిన తొండం---- పరిస్థితులను తట్టుకునేవిధంగా తనను తాను మలచుకొంటూ, తనదైన వ్యక్తిత్వాన్ని వదలకుండా చూసుకో మని చెపుతుంది.
చిన్ని నాలుక--- ఆత్మ పరిశీలనకు
యజ్ఞోపవీతంగా సర్పం--- సర్పం కుండలిని శక్తికి ప్రతీక, ప్రతి ఒక్కరు తమ కుండలిని శక్తిని వృద్ధి చేసుకోవటం కోసం ప్రయత్నించాలి అని.
లంబోదరం---- జీవితం లో ఎదురయ్యే మంచిని చెడుని సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగమని, (వినాయకుని ఉదరంలో సమస్త లోకములు ఉన్నాయి అని మరో అర్ధం చెప్పుకోవచ్చు).
నాలుగు చేతులు---- చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు,
చిన్నినోరు---- తక్కువ మాట్లాడడానికి,
అభయ ముద్ర---- భక్తులకు భయపడనవసరం లేదని చెప్పుట.
వరద ముద్ర---- కోరిన కోరికలు తీర్చగలను అని చెప్పుట.
పాశం (పై ఎడమ చేతిలో)--- భక్తులను ఆధ్యాత్మిక విషయముల వైపునకు లాగుతాను అని.
గొడ్డలి (పై కుడి చేతిలో)----- కర్మబంధములనుండి విముక్తిని కలిగించగలను అని.
మోదకము/ కుడుము---- సాధన ద్వారామత్రమే అతి మధురమైన మోక్షం లభిస్తుంది అని.
పాదముల వద్ద ఉన్న ఫలములు----- ఈ ప్రపంచములో కావలసినవి అన్ని ఉన్నాయి, కేవలం నీవు శ్రమించి వాటిని సాధించుకోవాలి.
ఎలుక---- ఎక్కడి, ఏమూలకు అయిన చేరగలిగిన, తనకు అడ్డంగా ఉన్నదానిని దేనిని అయిన నాశనం చేయగలిగిన సామర్ధ్యం ఉండాలి, కాని అది మన ఆధీనంలో ఉండాలి.
ఇద్దరు భార్యలు సిద్ధి ,బుద్ధి వారి పుత్రులు శుభము, లాభము మరియు పుత్రిక సంతోషి----- మన బుద్ధి (మనస్సు) మన ఆదీనం లో ఉంటే మనం కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి. దానితో పాటుగా మనకు మంచి జరుగుతుంది, లాభము కూడా లభిస్తుంది.
మరి సంతోషి ని కుమార్తె అని ఎందుకు చెప్పారు???
మనకు జరిగిన మంచిని కాని శుభమును కాని మరొకరికి పంచటానికి మనం ఆలోచించ వచ్చు కాని వాని వల్ల కలిగిన ఆనందాన్ని అందరికి పంచుతాము. కనుకనే సంతోషి ని కుమార్తెగా చెప్పారు.

మరోవైపు వినాయక చతుర్థి రోజున ---"స్వస్తిక పద్మం" లిఖించడం ద్వారా శుభం_* చేకూరుతుందని విశ్వాసం.

శ్రీ మహాగణపతి, లంబోదరుడు, వక్రతుండుడు అని పిలువబడే వినాయకుడు ఉద్భవించిన రోజున ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో సిద్ధి బుద్ధి అని రెండు వైపులా రాసి స్వస్తిక పద్మం లిఖించడం ద్వారా శుభాన్ని ఆకాంక్షించవచ్చును. ఈ గుర్తు గీసి "అస్మిన్ స్వస్తిక పద్మే శ్రీ మహాగణపతిం ఆవాహయామి" అని ఆవాహన చేసి మహాగణపతికి పూజలందిస్తారు.

దీనిని బట్టి
మహాగణపతికి, స్వస్తిక పద్మానికి అవినాభావ సంబంధం ఉంగి. హోమమే కాక ప్రతిష్ట లేక అనుష్టానాదులతో కూడా నవగ్రహాలతో పాటు గణపతి స్థానంలో స్వస్తిక పద్మం వేసి గణపతిని ఆరాధించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెబుతున్నారు.