"లంక" సినిమా రివ్యూ

చిత్రం : లంక
రేటింగ్‌ : 2.0/5.0
నిర్మాతలు: నామన దినేష్‌, నామన విష్ణుకుమార్‌
సంగీతం : శ్రీచరణ్‌ పాకాల
దర్శకుడు : శ్రీముని
విడుదల : ఎప్రిల్ 21, 2017

స్టారింగ్‌ :రాశి, సాయి రోనాక్, ఐనా సాహ, సుప్రీత్, సుదర్శన్ తదితరులు...

75 సినిమాల్లో హీరోయిన్ గా నటించి వివాహం చేసుకుని స్థిరపడిన అలనాటి మేటి హీరోయిన్ రాశి మళ్ళీ 2వ ఇన్నింగ్స్ ఈ సినిమాతో మొదలుపెట్టారు. చాలా రోజుల తరవాత ఒక హారర్ సినిమా నేపధ్యంలో నిర్మించిన "లంక"తో మన ముందుకు వచ్చిన రాశి ప్రేక్షకులను ఇంతకు పూర్వంలా మెప్పించగలిగారా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
సాయి (సాయి రోనక్), సుధా( సుదర్శన్) ఎలాగైన సినీ రంగంలో స్థిరపడాలన్న కోరికతో తల్లితండ్రులు ఎంత తిడుతున్నా పట్టించుకోకుండా సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు. సిల్వర్ స్క్రీన్ మీద ఛాన్స్ కొట్టాలంటే ముందు షార్ట్ ఫిలింతో ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.ఆ షార్ట్ ఫిలింను తానే నిర్మిస్తానని మాట ఇవ్వటంతో పాత సామాన్ల వ్యాపారం చేసే సత్యను హీరోగా తీసుకుంటారు. హీరోయిన్ కోసం వెతుకుతుండగా. ఓ షాపింగ్ మాల్ స్వాతి(ఈన సాహా)ను చూసి ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ అవుతాడు. అప్పటికే మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన స్వాతి ముందు కాదన్న అప్పటికే తాను ఓ పెద్ద ప్రమాదంలో ఉండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం లో నటించేందుకు ఒప్పుకుంటుంది.
అయితే స్వాతి హీరోయిన్ అని తెలియని సాయి, సుధాలు రెబాకా విలియమ్స్(రాశి) బంగ్లాలో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎవరూ లేని ఇంట్లో ఒక్కతే ఉండే రెబాకా ప్రవర్తన అందరికీ వింతగా అనిపిస్తుంది. చనిపోయిన తన పిల్లలను ఉన్నట్టుగా ఊహించుకొని బతుకుతున్న రెబాకాకు స్వాతి దగ్గరవుతుంది.ఆ సమయంలో అనుకోకుండా స్వాతి కనిపించకుండా పోయిందన్న వార్త నేషనల్ మీడియాలో ప్రసారమవుతుంది. స్టార్ హీరోయిన్ మిస్ అవ్వటంతో పోలీస్ డిపార్ట్ మెంట్ కేసు ను సీరియస్ గా తీసుకుంటుంది. స్వాతితో షార్ట్ ఫిలిం తీసిన సాయి టీంను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తారు. అదే సమయంలో స్వాతికి దగ్గరైన రెబాకాను అనుమానిస్తారు. అసలు స్వాతి ఎలా మిస్ అయ్యింది? స్వాతి ఏ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం చేసేందుకు ఒప్పుకుంది? రెబాకాకు స్వాతికి సంబంధం ఏంటి? చివరకు స్వాతి రెబాకాలు ఏమయ్యారు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల ఫర్ఫార్మెన్స్‌...
రాశి తన పాత్రలో ఒదిగిపోయింది. తన పిల్లలు చనిపోయినా.. ఇంకా తన దగ్గరే ఉన్నారనుకొని జీవించే అమ్మ పాత్రలో రాశి తప్ప మరెవరూ సెట్ కారనిపించింది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన స్వాతి పాత్రలో ఐనా సాహ చక్కగా నటించింది. తన హావభావాలతో ఫర్వాలేదనిపించింది. సాయి రోనాక్ నటనలో ఇంకా ఎదగాల్సిఉంది. డైలాగ్ డెలివరీ కూడా సరిగ్గా లేదు. సినిమాలో అనవసరమైన కామెడీతో సత్య, సుదర్శన్, వేణు విసిగించేశారు.

సాంకేతికపరంగా...
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్లుగా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లను ఎడిట్ చేస్తే కథ కాస్త గ్రిప్పింగ్‌గా ఉండేది. టేకింగ్ పరంగా దర్శకుడు తన పనికి న్యాయం చేయాలనుకున్నా. కథ, కథనాల్లో సరైన బలం లేకపోవడంతో అది కాస్త ఫెయిల్ అయింది. గ్రాఫిక్స్ వర్క్ అవసరం లేకపోయినా పెట్టారు. అయితే అది సినిమాకు మైనస్‌గా నిలిచింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

విశ్లేషణ...
టెలీపతి ఆధారంగా చేసుకొని ఓ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ కథను రాసుకున్నారు దర్శకుడు శ్రీముని. అయితే సినిమా మొదటి భాగం పూర్తయ్యే వరకు కథలోకి వెళ్లకపోవడగం మైనస్. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ప్రేక్షకుడు ఉంటాడు. సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ హాఫ్‌లో వేసిన చిక్కుముడులను విప్పుతూ ట్విస్ట్‌లను రివీల్ చేస్తూ ఉంటారు. కథనంలో పట్టు లేకపోవడంతో ప్రేక్షకులు కథకు తొందరగా కనెక్ట్ కాలేరు.

నచ్చినవి...
రాశి నటన
శ్రీ చరణ్ సంగీతం
సినిమాటోగ్రఫి
ఎడిటింగ్
నిర్మాణ విలువలు

నచ్చనివి...
కథలో సాగతీత
స్క్రీన్ ప్లే

చివరగా...
రాశికి ఈ లంక అంత కలిసిరాల..