రౌడీషీటర్ హల్చల్

హైదరాబాద్‌లో ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. ఓ యువతిపై మూడు రోజుల పాటూ అత్యాచారం చేసిందే కాక, పోలీసులు కేసు ఎందుకు పెట్టారంటూ ఏకంగా స్టేషన్ ముందే హల్చల్ చేశాడు. కేసు ఎత్తివేయాలంటూ బ్లేడుతో చెయ్యి కోసుకొని, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. అతి కష్టంమీద అతడ్ని పట్టుకున్న పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. చిలకలగూడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వారాసిగూడ సమీపంలోని అంబర్‌నగర్‌లో ఉండే అమీర్‌కు గతంలోనే పెళ్ల అయ్యింది. ముగ్గురు సంతానం కూడా. అయినా పాడు బుద్ధితో తన ఇంటి సమీపంలో ఉండే ఓ యువతిపై కన్నేశాడు. ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెపై వేధింపులకు దిగుతూ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం అమీర్ యువతి ఇంటికి వెళ్లాడు. అడ్డుకున్న యువతితో పాటూ తల్లిని చితకబాదాడు. చంపేస్తానని బెదిరించడంతో ఆమె ఏమీ చేయలేకపోయింది.

యువతిపై తల్లి ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డాడు. గత మూడు రోజులుగా ఆమెపై అఘాయిత్యం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు. దీంతో భయపడిన బాధితులు ఏమీ చేయలేకపోయారు. విషయం ఆ నోటా ఈ నోటా స్థానికులకు తెలియడంతో.. వారు ధైర్యం చెప్పారు. వెంటబెట్టుకొని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తనపై జరిగిన దారుణం గురించి చెప్పడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు.

తనపై కేసు నమోదయ్యిందని తెలుసుకున్న అమీర్ ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు ప్రత్యక్షమయ్యాడు. చొక్కా విప్పేసి నానా రచ్చ చేశాడు. అక్కడే మద్యం గ్లాసుతో హల్చల్ చేశాడు. తనపై అక్రమంగా కేసు పెట్టారని.. వెంటనే ఎత్తివేయాలంటూ పోలీసుల్ని కూడా దుర్భాషలాడాడు. బ్లేడుతో తన చేతిని కొసుకొని.. ఆత్మహత్య చేసుకుంటానంటూ కాసేపు హంగామా చేశాడు. పోలీసులు పట్టుకోబోగా.. గొంతు కోసుకుంటానని బెదిరించాడు. ఇలా కొద్దిసేపు పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టగా.. మెల్లిగా అమీర్‌ను పోలీసులు పట్టుకోవడంతో ఈ హైడ్రామాకు తెరపడింది.