రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద!!

ఏకగ్రీవానికై కమలనాథుల కసరత్తులు

ఎవ్వరి ఊహలకు అందని ఆలోచన, ఏ పార్టీ కనీసం ఊహించని అభ్యర్థి. తన, పర , మిత్ర, అధికార, అంగ, అర్థ బలం అన్నది ఎవ్వరూ ప్రశ్నించకుండా అనూహ్యంగానే ప్రధాని మోదీ దేశ ప్రథమ పౌరుని అభ్యర్థిని బరిలోకి దించారు. ఢిల్లీలో బిజెపి పార్లమెంటరీ సమావేశంలో అందరి సమక్షంలోనే ప్రధాని మోదీ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద పేరును బరిలోకి దించారు. ఇప్పటివరకు దళిత రాష్ట్రపతిగా కెఆర్‌ నారాయణ మాత్రమే పనిచేశారు. అది నాటి కాంగ్రెస్‌ హయాంలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆమోదించి ఏకగ్రీవంగా నిలబెట్టింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో వచ్చిన మోదీ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా దళితుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు కనీసం ఆ పార్టీ మాతృసంస్థకు కూడా అందని విధంగా తీసుకోవడంతో పార్టీ నేతలే కాసింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. బీహార్‌ గరవ్నర్‌గా పనిచేస్తున్న రామ్‌నాథ్‌ కోవింద 12 సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం రామ్‌నాథ్‌కు ఉంది. అంతేకాకుండా బిజెపి దళిత అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం కూడా రామ్‌నాథ్‌కే దక్కుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావాలనున్న రామ్‌నాథ్‌ ఆదినుంచి బిజెపిలోనే ఉంటూ వస్తున్నారు కూడా. బహుశా ఆయన కూడా తాను రాష్ట్రపతి అభ్యర్థిత్వం పోటీలో ఉన్నానని ఊహించి ఉండరేమో. ఈ నెల 23తో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణమ్‌ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండడం, ఆలోపే రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తానని కేంద్రం చెప్పడం విదితమే. మూడు రోజుల నుంచే రాష్ట్రపతి అభ్యర్థిపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అన్ని పార్టీల మద్దతు కూడగట్టే యత్నం కూడా చేశారు. నేషనల్‌ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలను కూడా అమిత్‌ షా సంప్రదించే యత్నం చేశారు. దక్షిణాది పర్యటనలో ఉన్న అమిత్‌ షా ఆయా రాష్ట్రాల్లో పార్టీ నేతలతో పాటు ముఖ్యమైన లీడర్లను కలిసి పార్టీ అభ్యర్థిత్వంపై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం, చెప్పడం కూడా జరిగింది. అనుకున్నట్లు గానే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశమై పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద పేరును తెరపైకి తెచ్చింది. దీంతో పోటీ ఉండదన్న నమ్మకంతోనే ప్రధాని నరేంద్రమోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా పార్టీలో మేథావులైన రాజ్‌నాథ్‌, వెంకయ్య, అరుణ్‌జైట్లీ, అనంత్‌కుమార్‌ వంటి నేతలతో బిజెపి పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం జరుగుతుండగానే అభ్యర్థిని ప్రకటించడం మోదీ ఆలోచన సరళికి నిదర్శనమంటున్నారు రాజకీయ నిపుణులు. వాస్తవానికి ఆదినుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆ పార్టీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నేతలే బరిలోకి దిగుతున్నారని ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. ఈ మధ్యనే రాష్ట్రపతి ప్రణబ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కలవడం, పైన ఉదహరించిన వ్యాఖ్యలకు తోడ్పాటునిచ్చాయి కూడా. అయితే అటు పార్టీలోను, ఇటు దేశవ్యాప్తంగా ఏ ఒక్కరు ఊహించని విధంగానే రామ్‌నాథ్‌ కోవింద పేరును ప్రధాని మోదీ తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ను కాదని మద్దతు తెలిపిన సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం ఇప్పటికే సై అన్నారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన ఒక్క శివసేన మాత్రమే అనుకున్న, ప్రతిపాదించిన వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టకపోవడంపై కాస్త గుర్రుగానే ఉంది. ఏదైనా బిజెపి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద తెరపైకి తీసుకురావడం, అందుకు ఏకగ్రీవ పోటీకై ఆ పార్టీ బేరసారాలు మొదలు పెట్టాల్సి ఉంది.