"రంగస్థలం" సినిమా రివ్యూ

చిత్రం: రంగస్థలం
రేటింగ్: 3.0/5.0
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
దర్శకత్వం : సుకుమార్
నిర్మాతలు: నవీన్, రవి శంకర్, సి వి మోహన్

స్టారింగ్ : రామ్ చరణ్, సమంత, జగపతిబాబు, ఆది, పూజా హెగ్డే,ప్రకాష్ రాజ్, అనసూయ, బ్రహ్మాజీ తదితరులు

చాలా పెద్ద బ్రేక్ తరవాత రామ్ చరణ్ ఈ రోజు ఒక సరికొత్త కథతో, సరికొత్త పాత్రలో మన ముందుకు వచ్చారు. విభిన్న కథనాలతో ప్రయోగాలు చేసే సుకుమార్ ఈ సారి 1985 నాటి సామాజిక పరిస్థితులను తన కథలో భాగంగా చేసుకుని, అందులోనూ రామ్ చరణ్ తో ఈ కథను తెరకెక్కించారు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు విజయం సాధించిందో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
ఫణీంద్ర భూపతి(జగపతి బాబు)ప్రెసిడెంట్‌ గా ఆ ఊరి బాగోగులు చూసుకోవాల్సింది పోయి ప్రజలను తనదైన శైలిలో పరిపాలిస్తుంటాడు. అతని ఆగడాలను భరించలేని కొందరు తిరగబడతారు. అలా తిరగబడిన వారెవ్వరూ ప్రాణాలతో ఉండరు. ఈ అన్యాయాలను ఎదిరించాలనే ఉద్దేశంతో కుమార్ బాబు(ఆది పినిశెట్టి) అనే యువకుడు సర్పంచ్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా నామినేషన్ వేస్తాడు. కుమార్ బాబుకి వినికిడి సమస్య ఉన్న తమ్ముడు చిట్టిబాబు(రామ్ చరణ్) ఉంటాడు. దూకుడు తత్వం గల చిట్టిబాబు ఓ సమస్యగా భావించడు. ఊరు బాగు కోసం పోరాడుతున్న తన అన్న వెన్నంటే ఉంటూ కాపాడుతుంటాడు. అన్నట్టు చిట్టిబాబు అదే ఊర్లో ఉండే రామలక్ష్మి(సమంత) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వీరిద్దరి ప్రేమ, రంగస్థలంలో రాజకీయాల నేపథ్యంతో తెరకెక్కించిందే ఈ సినిమా.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
బహుశా ఇక అందరూ చరణ్‌ను ముద్దుగా చిట్టిబాబు అని పిలుచుకుంటారేమో నంతగా ఒదిగిపోయాడు.ప్రతి ఎక్స్‌ప్రెషన్‌నూ రాజీ పడకుండా లోపం ఉందని ఎత్తిచూపలేని విధంగా నటించాడు. ప్రేమించిన అమ్మాయి ప్రేమకోసం పరితపించే కుర్రాడిగా, అన్న కోసం ప్రాణాలైనా ఇచ్చేసే ఓ తమ్ముడిగా తెరపై చక్కటి భావోధ్వేగాలను పండించాడు.ఇక రామలక్ష్మిగా సమంత నటన అద్భుతమనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా గేదెలను శుభ్రం చేస్తూ, పొలం పనులు చేస్తూ నటన కోసం ఏమైనా చేస్తానని నిరూపించింది. లంగావోణీలో సగటు అమ్మాయిలా అందంగా కనిపించింది. ఇక సినిమాలో మరో హైలైట్ కుమార్ బాబు పాత్ర. మృదు స్వభావిగా, ఊరు బాగు కోసం తాపత్రయ పడే వ్యక్తిగా ఆది పినిశెట్టి నటన చాలా బాగుంది. క్లైమాక్స్‌లో కుమార్ బాబు పాత్ర చనిపోయినప్పుడు కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు.ప్రెసిడెంట్‌గా జగపతిబాబు, ఎమ్మెల్యేగా ప్రకాష్ రాజ్‌లు ఒదిగిపోయారు. సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర రంగమ్మత్త. ఈ పాత్రను అనసూయ పోషించడం సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. గ్లామర్ మాత్రమే కాదు నటనతో కూడా మెప్పిస్తానని అనసూయ నిరూపించింది.

సాంకేతికపరంగా...
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. ప్రతి పాట సందర్భానుసారంగా వచ్చినవే. దేన్ని కావాలని చొప్పించిన భావన ప్రేక్షకుడికి కలగదు. సన్నివేశాలను పాటలతో లింక్ చేస్తూ చూపించడం బాగుంది. పాటల చిత్రీకరణ మనసును తాకుతుంది. ఇక దేవి నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ మరో హైలైట్. 1980ల నాటి నేపథ్యాన్ని తెరపై చక్కగా చూపించారు. కళా దర్శకత్వాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. రామకృష్ణ నేతృత్వంలో వేసిన పల్లెటూరు సెట్స్ సహజసిద్ధంగా ఉన్నాయి.

విశ్లేషణ...
మారుమూల గ్రామం, అక్కడి ప్రజల కష్టాలు, వాటిని ఎదిరించాలనుకునే ఇద్దరు అన్నదమ్ములు, ఇదే లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసును హత్తుకునేలా దర్శకుడు రూపొందించారు. తెరపై పాత్రధారులు కనిపించరు, పాత్రలు తప్ప.ఇటువంటి పొలిటికల్, ఎమోషనల్ డ్రామాను ప్రేక్షకులకు విసుగు రాకుండా మూడు గంటల పాటు తెరపై నడిపించడం దర్శకుడు సుకుమార్‌కు మాత్రమే సాధ్యం. ఒక్కో పాత్రను సుక్కు డిజైన్ చేసిన తీరు మరో ఎత్తు. ఈ సినిమాతో సుకుమార్ రేంజ్ మరింత పెరగడం ఖాయం. రెగ్యులర్ సినిమాలను చూసి బోర్ ఫీలయ్యే ప్రేక్షకులకు ‘రంగస్థలం’ మంచి రిలీఫ్‌ను ఇస్తుంది. ఇక అభిమానులకైతే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.

నచ్చినవి...
కథ
కథనం
స్క్రీన్ ప్లే
సంగీతం
అందరి నటన

నచ్చనివి...
ఎడిటింగ్

చివరగా...
అందరు చూడదగిన సినిమా