యూపీ సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం

తాజాగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ స్థాయిలో యూపీ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు సాధించుకున్న బీజేపీ సీఎం అభ్యర్థిపై గత కొన్ని రోజులుగా చర్చు జరిగాయి. మొదట కేంద్ర మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను సీఎంగా ఖరారు చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. కాని సీఎంగా అనూహ్యంగా వివాదాస్పదుడు అయిన యోగి ఆదిత్యనాథ్‌కు ఛాన్స్‌ దక్కింది.

వరుసగా అయిదు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపు సాధించిన యోగిని సీఎం చేయడం వెనుక మోడీ ప్రముఖ పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న యోగి నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

యోగితో పాటు ఉప ముఖ్యమంత్రులు మరియు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రధాని మోడీ, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు మరియు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌లు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న యోగికి హిందువుల మద్దతు పుష్కలంగా ఉంది. అందుకే బీజేపీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. యోగిని సీఎంగా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ కూడా సుముఖతను వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్య కూడా యోగిని యూపీ సీఎంగా ఎంపిక చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో యూపీలో అత్యధిక స్థానాలు సాధించేందుకు సైతం ఈ ఎన్నిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.