"యుద్ధం శరణం" సినిమా రివ్యూ

చిత్రం: యుద్ధం శరణం
రేటింగ్: 2.5/5.0
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం: కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు
నిర్మాతలు: ర‌జ‌ని కొర్ర‌పాటి

స్టారింగ్: నాగ‌చైత‌న్య , లావ‌ణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రావు రమేశ్, రేవతి, మురళీ శర్మ తదితరులు

"ప్రేమమ్ ", "రారండోయ్ వేడుక చూద్దం" వంటి డీసెంట్ హిట్ తరవాత చైతూ ఎంచుకున్న వైవిధ్యభరితమైన కథ ఇది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ "యుద్ధం శరణం". నాగ‌చైత‌న్యతో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందించిన చిత్రం "యుద్ధం శ‌ర‌ణం". సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో నటించాడు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. చైతు నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా ఫై అక్కినేని అభిమానులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలను చైతు ఏ మేరకు అందుకున్నాడో ఈ రివ్యూలో చూద్దాం..

కథలోకివెళితే...
అర్జున్(నాగ చైతన్య) డ్రోన్ డిజైనింగ్ గా పనిచేస్తుంటాడు. తన తల్లిదండ్రులు మాత్రం వృత్తి రీత్యా డాక్టర్స్ కావడం తో ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తుంటారు. వారికీ ఇంట‌ర్న్ షిప్ చేయాల‌ని వారిదగ్గరికి వచ్చిన అంజలి (లావణ్య త్రిపాఠి ) ను చూసి అర్జున్ ప్రేమలో పడతాడు. కొడుకు ప్రేమకు తల్లిదండ్రులు కూడా ఒకే చెపుతారు. మరోవైపు నాయక్(శ్రీకాంత్) అనే రౌడీ సిటీలో బాంబు పేలుళ్లు జరుపుతాడు. అసలు అవి ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఎన్ఐఏ ఆఫీసర్ జె.డి.శాస్త్రి(మురళీశర్మ)ని నియమిస్తుంది.అయితే గుడికి అని బయలుదేరిన అర్జున్ తల్లిదండ్రులు ఇంటికి తిరిగిరారు. దీంతో అర్జున్ వారిని వెతకడం కోసం తిరుగుతూ ఉంటాడు. ఇంతలో వారు శవాలుగా కనిపిస్తారు. అది చూసి తట్టుకోలేపోతాడు అర్జున్. యాక్సిడెంట్‌లో ఇద్దరూ చనిపోయారని పోలీసులు చెబుతారు. అయితే అది యాక్సిడెంట్ కాదని తన తల్లితండ్రులను ఎవరో కావాలనే చంపారనే విషయం అర్జున్‌కి తెలుస్తుంది. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? అసలు ఎందుకు చంపారు? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటులఫర్ఫార్మెన్స్...
నాగచైతన్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఒరిజినల్‌గా చేసిన స్టంట్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. చైతు, లావణ్య త్రిపాఠి జంట తెరపై ముచ్చటగా ఉంది. రావు రమేష్, రేవతిలు తల్లితండ్రుల పాత్రల్లో ఇమిడిపోయారు. శ్రీకాంత్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు.తన తల్లిదండ్రులను చంపిన రాజకీయ నాయకుడి ఫై ప్రతీకారం తీసుకునే యువకుడి పాత్రలో ఒదిగిపోయి నటించాడు.చ‌దువుకున్న చ‌క్క‌టి ఇల్లాలిగా, భ‌ర్త అభిప్రాయాల‌ను గౌర‌వించే భార్య‌గా, చ‌క్క‌టి త‌ల్లిగా, స‌మాజ శ్రేయ‌స్సును కాంక్షించే వ్యక్తిగా రేవ‌తి న‌ట‌న ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొడుకుతో తండ్రికుండే అనుబంధం గురించి రావు ర‌మేశ్ చెప్పే మాట‌లు బాగా ఆకర్షిస్తాయి.

సాంకేతికపరంగా...
కుటుంబం, స్నేహితులతో ఎలాంటి బాధాబందీ లేకుండా జీవించే పాతికేళ్ల కుర్రాడి జీవితంలో అనుకోని సంఘటన జరిగితే అతడు దాన్ని ఎలా ఎదిరిస్తాడనే పాయింట్‌ను తెరపై బాగా ప్రెజంట్ చేశారు. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చిత్రీకరించాడు దర్శకుడు. సినిమా ఫోటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమాల్లో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో అదొకటి. సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడతను.

విశ్లేషణ...
ప్రేమమ్ , రారండో వేడుక చూద్దాం చిత్రాల తర్వాత చైతు నుండి సినిమా రావడం , అలాగే సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో కనిపించడం తో సినిమా ఫై అంచనాలు పెంచేసుకున్నారు సినీ ప్రేక్షకులు కానీ వారి అంచనాలు అందుకోవడం లో దర్శకుడు నిరాశ పరిచాడు. కథ లో కొత్తదనం లేకపోవడం , మ్యూజిక్ వర్క్ అవుట్ కాకపోవడం , సన్నివేశాల్లో సాగదీత ఎక్కువగా ఉండడం , కథనం తో సినిమా నడిపించడం వల్ల జనాలకు ఎంత మేరకు నచ్చుతుంది అనేది ప్రశ్న.

నచ్చినవి...
నాగ చైతన్య, లావణ్య లవ్ ట్రాక్
ఫస్ట్ హాఫ్
ప్రియ‌ద‌ర్శి కామెడీ

నచ్చనివి...
కథ
సన్నివేశాల సాగదీత
మ్యూజిక్

చివరగా...
హీరోకి అన్యాయం జరిగితే చేసే యుద్ధం