మే 1 నుంచి విఐపిలందరి కార్లకు ఎర్రబుగ్గ తొలగింపు!!

మే 1 నుంచి ప్రధానితో సహా విఐపిలందరి కార్లకు ఎర్రబుగ్గ తొలగింపు ,కేంద్రమంత్రి వర్గం నిర్ణయం

ఇక నుంచి వీధుల్లో విఐపి బుగ్గకార్ల హడావుడి కనిపించదు. సాక్షాత్తూ రాష్ట్రపతి, ప్రధానితో సహా విఐపిలందరి కార్లకు ఉన్న ఎర్రబుగ్గను మే 1 నుంచి తొలగించాలని ప్రధానమంత్రి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్‌లు, సైనిక, పోలీసు అధికారుల వాహనాలపై మాత్రం నీలరంగు బుగ్గను కొనసాగిస్తారు. మంత్రివర్గ సమావేశ అనంతరం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ ఈ సారి మంత్రివర్గ సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం, ఒక్క అత్యవసర సర్వీసు వాహనాలను మినహాయించి మిగిలిన వాటిపై మే 1 నుంచి బుగ్గలను తొలగిస్తున్నాం అని పేర్కొన్నారు. కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న వెంటనే గడ్కరీ తన కారుకు ఉన్న ఎర్రబుగ్గను తొలగించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ మే 1న వెలువడనుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌లు తమ కార్లపై ఎర్రబుగ్గలను తొలగించారు. వీరు అమలు చేసిన నెల తర్వాత కేంద్రమంత్రివర్గం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.