మహిళా.. ఎప్పటికీ నువ్వు అక్కడేనా!

అంతర్జాతీయ 'మహిళా' దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం

సమానత్వం ` సాకారమయ్యేనా!!!

అమ్మంటే అనిర్వచీయం. ఆమె బ్రహ్మకు పర్యాయపద. ఆమెను 66 పేర్లతో పిలుస్తారు. ఆమెను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. అయితే అంతకన్నా ఉన్నతంగానే బాధ్యతలు నెరవేరుస్తోంది అమ్మ. ప్రపంచ గతికి, ప్రగతికి ఆమె మూలాధారం. పంచభూతాల సమాహారం.. సృష్టికి ప్రతిసృష్టి చేసే స్త్రీ నేటికి తన ఉనికి కోసం పోరాడుతూనే ఉంది. సుదీర్ఘ సమరం చేస్తూనే ఉంది. నేటికి సఫలీకృతం కాలేకపోతోంది. అందుకే శరత్‌ అన్నారు. స్త్రీల సానుభూతి, సహకారం లభించనిదే ఉద్యమం సఫలీకృతం కాలేదు. 'మహిళా' అని శిరము జ్ఞానమయం. వదనం, ప్రేమయనం, సయనం`కరుణమయం, దేహం`జననమయం, జగతికి`జీవనగమనం, నీవులేని ఈ లోకం అధకార బంధురం.. ఇది నిత్యం.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి, గ్రహాంతరాలను చుట్టి వచ్చి, సంద్రంలోతును చూసి, శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతూ సవాళ్లును ఎదుర్కొంటూ, అవరోధాలను అధిగమిస్తూ కెరటంలా పడుతూ, లేస్తూ, శక్తి యుక్తులను కూడగుట్టకొని తన సత్తాను ప్రపంచానికి చాటిచెబుతోంది. ఎంతఎత్తుకు ఎదిగిప్పటికీ పుట్టిన దగ్గర నుండ పోయే వరకూ వివక్షకు గురవుతూనే ఉంది.

అధికారంలో ఉన్నా, ఉద్యొగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తూ మౌనంగా భరించే 'మహిళ'లెందరో ఉన్నారు. సమాజంలో జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు మానసికంగా స్వేచ్చకోల్పోయి, అణగదోక్కబడితే ఆ దేశం, ఆ సమాజం ఎలా పురోగతి చెందుతాయి? స్త్రీకి అన్ని హక్కులు చట్టపరంగా ఉన్నాయి. తాను కోరుకునేది జాలి, కరుణ కాదు. స్వేచ్ఛ సమానత్వం, గుర్తింపు, 'మహిళ'లు వృత్తిపరమైన హక్కుల కోసం సమాన వేతనాల కోసం, రాజకీయ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నారు. 1910 నుండి ప్రతియేటా మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకోవడం, 'మహిళా' సమస్యల పట్ల ఏకరువు పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా 'మహిళ'లు వారికోసం ఒకరోజు ఉందని భావించిన తమ చైతన్యం కోసం కార్యాచరణకు సమాయత్తం కావడం ఆనందాయకం. పోరాడి సాధించుకున్న హక్కులను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పుడిప్పుడే అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. స్త్రీ వివక్ష అనేది భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో కూడా ఉంది. ఇటీవల జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న లింగవివక్షవల్లే 'మహిళ'లు కనీస హక్కులకు దూరమవుతన్నామని సెలబ్రటీలు పేర్కొనడం గమనార్హం. శ్రమదోపిడీకి గురయ్యే వారిలో స్త్రీలే అధికంగా ఉన్నారు. అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలకే ఎక్కువ పనిచేసే మహిళలెందరో ఉన్నారు. సంంఘటిత రంగంలో మహిళా ఉద్యోగులు 8శాతం కన్నా తక్కువే. భారతదేశంలో ముఖ్యంగా కలవర పెట్టేది మాతృమరణాలు, 87శాతం గర్భిణీ స్త్రీలు మన దేశంలో రక్తహీనతతో బాధపడుతున్నారంటే మహిళల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రతి లక్షమందికి 138 మాతృమరణాలు జరుగుతుండగా, విజయనగరం జిల్లాలో కేవలం 99 మరణాలు సంభవించడమనేది మనవారి ఘనతగా చెప్పుకోవచ్చు. శిశు మరణాలకు వస్తే రాష్ట్రంలో వెయ్యిమందికి 39 కాగా జిల్లాలో 8.56 మరణాలకు సంభవిస్తున్నాయి. గ్రామీణ పురుష అక్షరాస్యతా శాతం 78 కాగా మహిళల అక్షరాస్యత కేవలం 58 శాతం మాత్రమే. మహిళా అక్షరాస్యతను పెంచి, నైపుణ్యాలు సమర్థతను పెంచేందుకు ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప స్త్రీ పరిస్థితిలో మార్పును ఆశించలేమనేది స్పష్టం.

'మహిళా' రిజర్వేషన్ల బిల్లుపై చిత్తశుద్ది చూపాలి

రాజకీయాలలో 'మహిళ'లకు భాగస్వామ్యం కల్పించడమంటే మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం కాదు. 'మహిళ'లకు నిర్ణయికరణ శక్తినివ్వడం. 1996లో 81వ రాజ్యాంగా సవరణ ద్వారా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు 20 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ చట్టరూపం దాల్చలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి.. అధికారులు మారారు. కానీ బిల్లులకు మోక్షం కలగలేదు. 2010లో 'మహిళ'లకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు అనేక వివాదాల మధ్య రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్‌సభలోనూ, రాష్ట్రాల శాసన సభల్లోనూ, ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. 'మహిళ'లకు రాజకీయ సమానత కల్పించే విషయంలో అభివృద్ధి చెందిన దేశాలదీ అదే తీరు. జానాభాలో సగం స్త్రీలే అయినప్పటికీ మనదేశంలో పార్లమెంట్‌లో 545 సీట్లుకుగాను కేవలం 55 మంది 'మహిళ'లే ఎంపీలుగా ఉండడం గమనార్హం. మన పక్కనే ఉన్న చిన్న దేశమైన పాకిస్తాన్‌లో మహిళల ప్రాతినిధ్యం 22.5శాతం కాగా అతి పెద్ద దేశమైన చైనాలో మరీ తక్కువగా 21.3 శాతం ఉంది. అభివృద్ధి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో వీరి శాతం 16.8 మాత్రమే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే సూత్రం పాటిస్తున్నారన్నది వాస్తవం. రాష్ట్ర అసెంబ్లీ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 175 సీట్లకుగాను కేవలం 19మంది మహిళా శాసనసభ్యులు ఎన్నిక కాగా, 20 మంది మంత్రివర్గంలో కేవలం ముగ్గురే మహిళా మంత్రులు కావడం దీనికి నిదర్శనంగా పేర్కొన్నవచ్చు. రిజర్వేషన్లు ఉంటేనే గానీ రాజకీయాల్లో 'మహిళ'లకు సముచితస్థానం లభించదని రుజువైంది. మహిళల భద్రతకు సంబంధించిన ముఖ్యంగా కుటుంబ పరంగా ఆమెకు రక్షణ కల్పించేందుకు 498(ఏ) చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిని తొలగించాలని కొంతమంది పురుషులు కొరుతున్నప్పటికీ మహిళలకు ఇది భద్రత కల్పిస్తోందన్న విషయంలో రాజీలేదు. అదేవిధంగా మహిళలకు పూర్తి రక్షణ కల్పించే మరో చట్టంగా నిర్భయ చట్టాన్ని పేర్కొనవచ్చు. 'మహిళ' మానప్రాణాలకు ఈ చట్టం ఎంతో ఉపకరిస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఉదంతం అనంతరం ఈ చట్టం పార్లమెంట్‌లో పురుడు పోసుకుంది. ఇదేకాక కర్మాగారాల్లో, ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు ఉన్నాయి. వీటిపట్ల మహిళలు పూర్తి అవగాహన పెంచుకుని అవసరాన్ని బట్టి వాటిని వినియోగించుకుంటే మహిళలకు సంపూర్ణ రక్షణ సాధ్యపడుతుంది. రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందని, ఆకాశంలో సగమైన 'మహిళ' అవకాశాల్లోను సగభాగాన్ని పొందేలా చేసేందుకు అన్ని వర్గాల నుంచి ప్రొత్సాహం అవసరం. దీనికి 2016 'మహిళా' దినోవత్సమే అంకురార్పణ కావాలని ఆశిద్దాం.