"మనసుకు నచ్చింది" సినిమా రివ్యూ

చిత్రం: మనసుకు నచ్చింది
రేటింగ్: 1.5/5.0
బ్యానర్:ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం : రాధన్
దర్శకత్వం : మంజుల ఘట్టమనేని
నిర్మాత: సంజయ్ స్వరూప్

స్టారింగ్ : సందీప్ కిషన్ , అమైరా దస్తూర్, త్రిధా చౌదరి తదితరులు

"షో" సినిమాతోనే నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న మంజుల (మహేష్ బాబు సోదరి) తొలిసారి దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘మనసుకు నచ్చింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్-ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్-పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మనసుకు నచ్చింది’
కొన్ని మంచి డైలాగ్స్ తో మహేష్ ఇచ్చిన వాయిస్ ఈ సినిమాకే హైలైట్ కానుంది. కాగా ఈ మూవీ మహేష్ బాబు అభిమానులు గర్వపడేలా ఉంటుందంటున్నారు దర్శకురాలు మంజుల. ‘మనసుకు నచ్చింది’ సినిమా కథ రాయడం మొదలుకొని, సినిమా పూర్తి చేయడం వరకూ కూడా ఒక నేచురల్ ప్రొసెస్‌లా జరిగింది. మా తమ్ముడు మహేష్, మా నాన్నగారు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది అని ఆమె చాలా నమ్మకంతో చెప్పడంతో అభిమానులే కాక ప్రతి ప్రేక్షకుడిలో ఆసక్తి పెరిగింది.మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..

కథలోకివెళితే...
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సూరజ్( సందీప్ కిషన్), నిత్య(అమైరా దస్తూర్)లను పెళ్లి బంధంతో ఒక్కటి చేయాలనుకుంటారు పెద్దలు. కానీ వారు మాత్రం ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామని, తమ జీవిత భాగస్వాములను తామే వెతుక్కుంటామని చెబుతారు. ఈ క్రమంలో గోవా పారిపోతారు. అక్కడ సూరజ్‌కు నిక్కీ(త్రిదా) పరిచయమవుతుంది. అలానే నిత్య, అభయ్(అదిత్ అరుణ్)కు దగ్గరవుతుంది. కానీ కొద్దిరోజులకే నిత్య తను నిజంగా ప్రేమిస్తుంది సూరజ్‌నే అని తెలుసుకుంటుంది. అప్పుడు ఏం చేసింది అనేది మిగిలిన కథ...

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
సందీప్ కిషన్ నుంచి సరైన నటన రాబట్టుకోలేకపోయారు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతి చేశాడనిపిస్తుంది. అమైరా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కూడా కనిపించింది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. త్రిదా చౌదరి గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. కానీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. అదిత్ అరుణ్ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి తన నటనతో ఓకే అనిపించాడు.

సాంకేతికపరంగా...
ఎడిట్ చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. రధన్ అందించిన సంగీతం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ...
‘నువ్వే కావాలి’ సినిమా నుంచి చూసుకుంటే ఇలాంటి స్టోరీ లైన్‌తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. మంజుల కూడా ఇదే కథను తనదైన శైలిలో చెప్పాలనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. కథనం బలంగా రాసుకోలేకపోవడం, సినిమాలో బలమైన సన్నివేశాలు ఉండకపోవడం పెద్ద మైనస్. సినిమా ఫస్ట్‌హాఫ్ చాలా వరకు తగ్గించే అవకాశం ఉన్నా అలా చేయలేదు. ప్రేమపై ఎక్కువ దృష్టి పెట్టకుండా సాదాసీదా సన్నివేశాలతో సినిమాను నడిపించారు. దీంతో ప్రేమకథల్లో ఆశించే లవ్, ఎమోషన్, డ్రామా ఈ సినిమాలో కనిపించకుండా పోయింది. సెకండ్ హాఫ్‌లో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ స్క్రీన్‌ప్లే‌తో సాగడంతో ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులకు రుచించదు.

నచ్చినవి...
అమైరా అందం

నచ్చనివి...
రోటీన్ కథ
స్క్రీన్ ప్లే

చివరగా...
రోటీన్ ప్రేమ కథె కానీ మంజుల డైరెక్ట్ చేసింది!!!!