భూమాపై శిల్పా కోపానికి కారణమదేనా?

భూమాపై శిల్పా కోపానికి కారణమదేనా, అఖిలప్రియ దూకుడుతో కష్టమనుకొన్నాడా?

నంద్యాల ఉప ఎన్నికలు భూమా, శిల్పా కుటుంబాల మద్యే పోరుగా మారాయి. ప్రధాన పార్టీల నుండి ఈ రెండు కుటుంబాల నుండి అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో ఈ ఎన్నికల్లో పోరు రసవత్తరంగా మారనుంది.ఈ ఏడాది మార్చి 12వ, తేదిన భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించలేదు.కానీ, నంద్యాలలో మాత్రం ఎన్నికల వేడి రాజుకొంది. మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ శిల్పా మోహన్‌ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దించింది. మరోవైపు భూమా బ్రహ్మనందరెడ్డి ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు అధికార, విపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ కూడ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్టుగా ప్రకటించింది.మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డికి, దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మధ్య విబేధాలున్నాయి. అయితే దీనికి కూడ ఓ కారణం ఉందంటారు. ఈ కారణం వల్లే శిల్పా మోహన్‌ రెడ్డి భూమాపై కోపాన్ని పెంచుకొన్నారనే ప్రచారం కూడ ఈ ప్రాంతంలో ఉంది.అంతేకాదు ఈ కారణంగానే శిల్పా మోహన్‌ రెడ్డి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. 2000 -2002 మధ్య కాలంలో శిల్పా మోహన్‌ రెడ్డి ఓ కాంట్రాక్ట్‌ విషయంలో భూమా నాగిరెడ్డిని సహయం కోరాడట., అయితే ఈ విషయమై భూమా శిల్పాను అవమానపర్చడంతో శిల్పాకు భూమా అంటే కోపమని ఆయన సన్నిహితుల వద్ద అంటుంటారని ప్రచారంలో ఉంది.శ్రీశైలం నీటి కోసం నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలిసి పోరాటం చేస్తూనే శిల్పా మోహన్‌ రెడ్డి రాజకీయంగా ఎదిగారు.అయితే 2004 లో శిల్పా మోహన్‌ రెడ్డి ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారిగా నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి ఆయన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుండి పోటీచేసి విజయం సాధించారు. అంతేకాదు ఈ దఫా ఆయన కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో కూడ స్థానం దక్కించుకొన్నారు. 2002 నుండి శ్రీశైలం నీటి కోసం శిల్పా చేసిన పోరాటం ఆయనకు రాజకీయాల్లో కలిసివచ్చిందని చెబుతారు.అయితే భూమా నాగిరెడ్డి అంటే శిల్పాకు కోపమున్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో వారిద్దరూ ముఖాముఖి తలపడింది 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే. నంద్యాల నుండి టిడిపి అభ్యర్థిగా శిల్పా పోటీచేస్తే వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి బరిలో నిలిచారు.అయితే ఈ స్థానం నుండి భూమా నాగిరెడ్డి స్వల్ప మెజారిటీతో శిల్పాపై విజయం సాధించారు. అయితే 2016 లో భూమా నాగిరెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరారు. భూమా టిడిపిలో చేరిన తర్వాత వీరిద్దరి మధ్య ఇంకా గొడవలు పెరిగాయి. అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విబేధాలను పక్కనపెట్టి శిల్పా చక్రపాణిర్డ్డిె గెలుపుకోసం భూమా నాగిరెడ్డి పనిచేశారు.భూమా వర్గం శిల్పాకు ఓటుచేయడం వల్లే శిల్పా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.భూమా నాగిరెడ్డితోనైనా మాట్లాడవచ్చు. కానీ, మంత్రి అఖిలప్రియతో మాట్లాడే పరిస్థితి ఉండదని శిల్పా మోహన్‌ రెడ్డి తన సన్నిహితులవద్ద ప్రస్తావించేవారని సమాచారం. తమ మధ్య విబేధాలున్నా శిల్పా కుటుంబంలో జరిగిన వివాహనికి చనిపోవడానికి కొద్దిరోజుల ముందే భూమా నాగిరెడ్డి హజరయ్యారు.నాగిరెడ్డి వ్యవహరించే తీరుకు, అఖిలప్రియ వ్యవహరించేతీరుకు చాలా వ్యత్యాసం ఉంటుందని శిల్పా తన అనుచరులతో అనేవారనే ప్రచారం ఉంది. అంతేకాదు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నంద్యాల కేంద్రంగా భూమా అఖిలప్రియ చేపట్టే కార్యక్రమాలు తనకు టిక్కెట్టు కేటాయించే విషయంలో తాత్సారాన్ని సహించలేక శిల్పా మోహన్‌ రెడ్డి టిడిపిని వీడారంటున్నారు.