బాబుకు ఓటమి భయం పట్టుకుందా?

టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పట్టుకుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వినిపిస్తున్న వాదనలు చూస్తుంటే నిజంగానే బాబుకు భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనంగానే చంద్రబాబు మొన్నటి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన సమీక్షలు... నిన్న ఆ జిల్లాను వదిలి తన సొంత జిల్లా చిత్తూరుకు వెళుతున్న సందర్భంగా అక్కడి ప్రజలతో ముచ్చటిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయినా మొన్న రాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఆయన చిత్తూరు జిల్లా బయలుదేరే దాకా జరిగిన వరుస పరిణామాలను ఓసారి పరిశీలిస్తే... మొన్న సాయంత్రం కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాలుపంచుకున్న చంద్రబాబు... మొన్న సాయంత్రానికి నంద్యాల చేరుకున్నారు.దివంగత నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమా కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబు భావించగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి చంద్రబాబుకు ఝలక్కిస్తూ వైసీపీలో చేరిపోయారు. దీంతో టికెట్‌ విషయంలో చంద్రబాబుకు కాస్తంత ఊపిరి పీల్చుకునే వెసులుబాటు లభించినా... భూమా నాగిరెడ్డి అన్న కొడుకు శేఖర్‌ రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డిని ఎలా గెలిపించుకోవాలో అర్థం కాక ఆయన సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజధాని ప్రాంతంలో అధికారిక ఇఫ్తార్‌ విందును ఇవ్వడానికి బదులుగా ఉప ఎన్నిక జరగనున్న చోట ఆ కార్యక్రమానికి తెర తీశారు. నంద్యాల చేరుకున్న వెంటనే పార్టీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు... ఇఫ్తార్‌ విందు తర్వాత గెస్ట్‌ హౌస్కు చేరుకుని మరోమారు సమీక్షలు మొదలుపెట్టారు. ఈ సమీక్షలు ఎప్పటిదాకా కొనసాగాయంటే... దాదాపుగా మొన్న అర్ధ రాత్రి దాకానట. ఒక్క నంద్యాల సీటునే గెలుచుకునేందుకు చంద్రబాబు ఇంత సుదీర్ఘంగా సమీక్షలు జరిపారంటే... అక్కడ టీడీపీకి ఎదురు గాలి వీస్తున్నట్టే కదా అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. భూమా కుటుంబంతో పాటు జిల్లా నేతలు మంత్రులు నారాయణ కాలవ శ్రీనివాసులు మాజీ మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌ కేఈ ప్రభాకర్‌ తదితర నేతలతో సుదీర్ఘ మంతనాలు నిర్వహించిన బాబు... ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని ఆర్డర్లేశారట. ఇక భూమా వారసుడి గెలుపు బాధ్యతను ఆయన కేఈ ప్రభాకర్‌ భుజస్కందాలపై పెట్టారట. ఆ తర్వాత బాగా ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించిన చంద్రబాబు... గురువారం ఉదయం త్వరగానే నిద్ర లేచి చిత్తూరు బయలుదేరే ముందు మరోమారు సమీక్షించారట. ఈ సమీక్షలో భాగంగానే నంద్యాలలో పెండింగ్లో ఉన్న అన్ని పనునలకు అక్కడికక్కడే నిధులు మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఎన్నికలు జరిగేలోగా నంద్యాల నేతలు ఏ పనులు అడిగినా... మరో ఆలోచన లేకుండా వాటిని మంజూరు చేయాలని మంత్రి నారాయణకు ఆర్డరేశారట. ఆ తర్వాత తనను కలిసేందుకు వచ్చిన నంద్యాల ప్రజలతోనూ ఆయన... తనకే ఓటు వేయాలని ఒకింత ఆశ్చర్యకరమైన రీతిలో తనదైన వాదనను వినిపించారట. పెన్షన్లు - రేషన్‌ సరుకులు - రుణమాఫీ చేస్తున్న తనకే ఓటేయాలని ఇతరులు డబ్బిచ్చినా కూడా తనకే ఓటేయాలని ఆయన వారితో చెప్పారట. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకున్నట్లుగా ఉహాగానాలు వెలువడుతున్నాయి.