బతుకమ్మ ఎలా చేయాలంటే...

పెత్ర అమావాస్య నుండి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నేడు తొమ్మిది రోజుల బతుకమ్మలో మొదటి రోజు. దీనిని పెత్ర అమావాస్య లేదా ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. అంటే బతుకమ్మ చేయడానికి చాలా రోజుల నుండి ఎంతో ప్రేమగా పెంచుకున్న పూలను పెత్ర అమావాస్య నాడు కోసి ఆడపడుచులు బతుకమ్మను పేర్చుతారు. అంటే పూలను ఈరోజు నుండి బతుకమ్మ కోసం కోస్తారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు.

పెత్ర అమావాప్య రోజున పెద్దల పండుగ అని చెప్పుకుంటారు. స్వర్గస్తులైన మాతా, పితలు నేడు తమ సంతానం తమకు ఏదైనా ఇవ్వాలని ఆశ పడుతారట. అందుకే చాలా మంది కూడా చనిపోయిన వారి తల్లిదండ్రులకు నేడు బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తారు. ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత ఒక పల్లెంలో బియ్యం, పప్పు, కూరగాయాలు, చింతపండు ఇలా తమ ఇంట్లో కలిగినవి భ్రాహ్మనులకు సమర్పిస్తారు. ఇలా చేయడాన్నే పెద్దల పండుగ అని అంటారు. పెత్ర అమావాస్య నాడు ఇలా చేస్తే పెద్దలకు మంచిదని కొందరి అభిప్రాయం.

ఆడవారు ఉదయాన్నే లేచి తమ ఇళ్లు, వాకిళ్లు అన్నీ కూడా శుభ్రం చేసుకుని తలంటు స్నానాలు చేసి పట్టు వస్త్రాలు ధరిస్తారు. ఆ తర్వాత తీరొక్క పూలను కోసుకొచ్చి ఇంట్లో బతుకమ్మను పేర్చుతారు. తండ్రి లేదా సోదరులు తమ ఆడపడుచుల కోసం ఉదయాన్నే పూలకు వెళ్లి పూలు తెస్తారు. ఇక ఆ పూతో ఆడపడుచులు తమ సాయిమాన్‌లో ఒక ప్లేటులో బీర, సోర కాయల ఆకులను తీసుకుని బతుక్మను పేర్చుతారు.

బతుకమ్మ పేర్చే విధానం..
ప్లేట్లో ఆకులను పెట్టిన తర్వాత తంగేడు పూలతో ఒత్తుగా పేర్చాలి. ఆ తర్వాత వివిధ రకాల పూలను తీసుకుని బతుకమ్మను పేర్చాలి. కొందరు చిన్న బతుకమ్మలను చేస్తే మరికొందరు పూలను బట్టి చాలా పెద్ద బతుకమ్మను కూడా చేస్తారు. కలుషితమైన నీటితో ఉన్న చెరువులు ఈ రోజు నుండి పూలు, పపుసు, కుంకుమలతో శుభ్రపడుతాయి. ఈ పండగ మన ఆనందానికే కాకుండా పర్యావరణానికి కూడా చాలా మేలు కలిగిస్తుంది. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించడం చాలా ఆనందం. నేటితో మొదలుకొని బతుకమ్మ తొమ్మిది రోజుల వరకు పేర్చుకొని ఆడవచ్చు.