ప్లాస్టిక్‌ లేదు గీస్టిక్‌ లేదు... అదంతా ఉత్తదే...

ఇదిగో తోక అంటే అదిగో పులి అనేసే పరిస్థితి. ఉన్నట్లుండి తెర మీదకు వచ్చింది ప్లాస్టిక్‌ బియ్యం. బుద్దున్నోడు ఎవరైనా ప్లాస్టిక్‌ బియ్యం అమ్ముతారా? అంటే కాసుల కక్కుర్తితో ఏ వెధవ పనికైనా దిగజారతారు కొందరని ఫైర్‌ అయిపోవడం కనిపిస్తుంది. ఇక్కడి చిన్న లాజిక్‌ ఏమిటంటే లాభం కోసం కాస్తంత కక్కుర్తిపడినా బియ్యం వండి చేతిలోకి పడగానే తేడా స్పష్టంగా తెలియటమే కాదు, షాపుకెళ్లి రచ్చరచ్చ చేస్తే పరువుపోవటం ఖాయం. ఈ నేపథ్యంలో ఎంత లాభం మీద పేరాశ ఉన్నా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడా? అన్నది సందేహమే. అయితే ఇవాల్టి రోజున ఎవరిని నమ్మలేని పరిస్థితి. ప్లాస్టిక్‌ బియ్యం మీద సోషల్‌ మీడియాలోనూ మీడియాలోను వార్తలు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆందోళనపడిన పరిస్థితి. సర్వం కల్తీ అవుతున్న తాజా పరిస్తితుల్లో ప్లాస్టిక్‌ బియ్యం కూడా నిజమేనని నమ్మేశారు జనం. దీనికి తోడు ప్లాస్టిక్‌ బియ్యంతో చేసిన అన్నం ఉండలు కట్టి నేలకేసి కొడితే అది బలంగా పైకి లేవటం ఆ ముద్దలతో క్రికెట్‌ ఆడిన వీడియోల పుణ్యమా అని భయం రెట్టింపు అయ్యింది. ఇదిలా ఉండగా అంతకంతకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ బియ్యం భయంతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ శాఖ కమిషనర్‌.. ఐపిఎస్‌ అధికారి అయిన సీవీ ఆనంద్‌ ప్లాస్టిక్‌ బియ్యం అంటూ జరుగుతున్న ప్రచారంపై పెద్ద ఎత్తున ఫోకస్‌ చేసి.. పలు పరీక్షలు నిర్వహించారు. ప్లాస్టిక్‌ బియ్యం వచ్చాయని చెబుతున్న మిల్లుపై సోదాలు నిర్వహించి అక్కడి బియ్యం శాంపిళ్లను పరీక్షలకు పంపారు. ఇంతా చేస్తే ప్లాస్టిక్‌ బియ్యం పేరిట జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని... అదంతా ఉత్తదేనని తేల్చారు. ప్లాస్టిక్‌ బియ్యం పేరిట వస్తున్నవన్నీ వదంతులుగా సీవీ ఆనంద్‌ తేల్చారు. తాము పరీక్షలు జరిపి వచ్చిన ఫలితాల వివరాల్ని మీడియాకు చెప్పారు. ప్లాస్టిక్‌ బియ్యంగా చెబుతున్న వాటిని వండి రుచి చూశామని, అవన్నీ ఉత్త పుకార్లుగా తేల్చారు. ప్లాస్టిక్‌ బియ్యం అయితే నీళ్లలో తేలాలని, కానీ అలా జరగలేదన్నారు. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న ప్లాస్టిక్‌ బియ్యం మీద అప్రమత్తంగా ఉన్నామని, ఎక్కడైనా కల్తీలు జరిగితే గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో ప్లాస్టిక్‌ బియ్యాన్ని గుర్తించేందుకు వీలుగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా చెప్పాలంటే ప్రాధమికంగా జరిగిన ప్లాస్టిక్‌ బియ్యం ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నది తేలిందని చెప్పక తప్పదు. సో ప్లాస్టిక్‌ బియ్యం మీద అనవసరమైన ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు.