ప్రజా ఆమోదం ఉంటేనే టిక్కెట్‌!!

ఈసారి సిట్టింగ్లకు తిప్పలే, విజయం దిశగా టీఆర్‌ఎస్‌ వ్యూహరచన!

నియోజకవర్గ ప్రజలు వద్దంటే ఆయా ఎమ్మెల్యేలకు ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరాదనే ఆలోచనలో టీఆర్‌ఎస్‌ కనిపిస్తోంది. విజయం దక్కాలంటే జనం మాటే పార్టీ మాటగా ముందుకెళ్లాలన్న యోజనతో అడుగులేస్తోంది. ఈ ప్రాతిదికన దాదాపు 20 నుంచి 30 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆరు నెలలకు ఒక సారి తెలంగాణలో నిర్వహిస్తున్న సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. నియోజకర్గంలో ప్రజలు సీఎం పనితీరుకు, పార్టీకి అనుకూలంగా స్పందిస్తున్నా, ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత చూపుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఈసారి మార్పు తప్పదని తెలుస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో తెరాస తొలుత 63 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత బీఎస్పీ సభ్యులు ఇద్దరు విలీనమయ్యారు. ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు, 12 మంది టీడీపీ సభ్యులు టీఆర్‌ఎస్‌లో విలీనవమయ్యారు. కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు చేరారు. ఈసారి రైతుల్లో, కుల, వృత్తుల వారిలో, ఉద్యోగులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్న వారి మద్దతు పార్టీకి ఉంటుందని, వీటితో పార్టీ విజయం సాధిస్తుందనే ధీమా అధికార పార్టీలో ఉంది. పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో 106 నుంచి 111 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించనున్నట్లు తేలింది. అయితే అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశాన్ని గత సమావేశాల్లోనే సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడినప్పుడూ కూడా ఆయన ఈ అంశాన్ని వారికి వివరించారు. జీహెచ్‌ఎసంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సిఫార్సులను పట్టించుకోకుండా స్థానికంగా ఉన్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీకున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే విధంగా శాసన సభ ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో వ్యక్తమైన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థులకు ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇతర పార్టీల నుంచి చేరిన వారిలో కొందరి పట్ల, టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారిలో కొందరి పట్ల సర్వేలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్‌ శాసనసభ్యులకు సూచనప్రాయంగా వెల్లడించారు. మీలో కొందరు పనితీరు మెరుగు పరుచుకోవాలి. సర్వేలో అనుకూలత వ్యక్తమైతేనే మళ్లీ అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అసవరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలను ఈ సారి పార్లమెంట్‌కు పోటీ చేయించనున్నారు. ఒకరిద్దరు ఎంపీలను శాసనసభకు పంపించే ఆలోచనలో కూడా పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నెలరోజుల్లో ప్రారంభమవుతుందనే అంచనాలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉంది. కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగినా, పెరగకపోయినా.. కొంత మంది ఎమ్మెల్యేలను అయితే మార్చాలనే ఆలోచన మాత్రం పార్టీ నాయకత్వానికి బలంగా ఉన్నట్టు తెలుస్తోంది.