"పటేల్ సర్" సినిమా రివ్యూ

చిత్రం: పటేల్ సర్
రేటింగ్: 2.0/5.0
బ్యానర్:వారాహి చ‌ల‌న చిత్రం
సంగీతం: వసంత్
నిర్మాత: రజిని కొర్రపాటి
దర్శకత్వం: వాసు పరిమి

స్టారింగ్: జగపతిబాబు, ప‌ద్మప్రియ, తాన్య హోప్, సుబ్బరాజు, కబీర్ దుహన్ సింగ్, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు

తండ్రిగా, విలన్‌గా వైవిధ్య భరితమైన క్యారెక్టర్లు పోషిస్తూ ఆకట్టుకుంటున్న ఆయన ఫుల్ టైమ్ హీరోగా విలక్ష‌ణ పాత్ర‌తో అంద‌రి మెప్పు పొందుతున్న జ‌గ‌ప‌తిబాబు మ‌ళ్లీ హీరోగా న‌టించిన మూవీ ప‌టేల్ సార్.ఈ మూవీతో వాసు ప‌రిమి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌య్యాడు.ఈ మూవీ స్టిల్స్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. ఈ రోజే విడుద‌లైన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
60 ఏళ్ల సుభాష్ ప‌టేల్ (జ‌గ‌ప‌తిబాబు) ఒకప్పుడు ఇండియ‌న్ ఆర్మీలో మేజ‌ర్‌. కార్గిల్ యుద్ధంలో పాల్గొని శ‌త్రువుల తూటాల‌కి ఎదురొడ్డిన ధీశాలి. త‌న పూర్వీకులంతా సైనికులుగా దేశానికి సేవ చేసిన‌వారే కావ‌డంతో, త‌న త‌ర్వాత త‌రం కూడా ఆర్మీలో చేరాల‌ని క‌ల‌లు కంటుంటాడు. సరిగ్గా అతడి రిటైర్మెంట్ స‌మ‌యంలో భార్య భార‌తి (ఆమ‌ని) అకస్మాత్తుగా మరణిస్తుంది. ఆ తర్వాత అతడు కొందరు డ్రగ్స్ సరఫరా చేసే వాళ్లను టార్గెట్ చేసి అంతమొందిస్తుంటాడు. అతడితో ఓ చిన్న పాప కూడా ఉంటుంది. ఆ డ్రగ్స్ మాఫియాకు నాయకుడైన డీఆర్ (కబీర్ దుహన్ సింగ్)ను అంతం చేయడానికి ఎదురు చూస్తుంటాడు. ఈ వరస హత్యల ఉదంతం కేసు విచారణను కేథరిన్ (తాన్యా హోప్) చేపడుతుంది. హత్యలు చేసే వ్యక్తి నుంచి డీఆర్‌ను కాపాడటానికి కేథరిన్ ప్రయత్నిస్తుంటుంది. అసలు. అరవై ఏళ్ల వయసులో పటేల్‌కు ఎవరినో చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పటేల్‌తో ఉన్న చిన్న పాప ఎవరు? అతడు తన పగ తీర్చుకోగలిగాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
జగపతిబాబు తన వైవిధ్యమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. తండ్రి కోసం కొడుకు పడే ఆరాటం, కొడుకు ప్రేమను పొందాలని పరితపించే తండ్రి పాత్రను బాగా డిజైన్ చేశాడు దర్శకుడు. అయితే ఇక్కడ తండ్రి, కొడుకు. రెండు పాత్రల్లోనూ జగపతి బాబే నటించడం విశేషం. రెండు పాత్రల్లోనూ ఎమోషన్స్ బాగా పండించాడు మన జగ్గూభాయ్. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లలో తన నటనతో కట్టి పడేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్లాడు. పద్మప్రియ తన పాత్రలో బాగా నటించింది. కబీర్ దుహన్ సింగ్ తనదైన శైలిలో విలనిజాన్ని పండించాడు. సుబ్బరాజు పాత్ర కూడా ఆకట్టుకుంటుంది.

సాంకేతికపరంగా...
దర్శకుడిగా వాసు మొదటి సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు. కొడుకు కోసం తండ్రి పగ తీర్చుకోవడం అనేది కొత్త పాయింట్ అయినప్పటికీ.. కథనాన్ని నడిపించే తీరు మరింత మెరుగ్గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. సినిమాలో వచ్చే ప్రతి పాట ఎక్కడో, ఎప్పుడో విన్న ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. ఎడిటింగ్‌ విషయంలో మరింత దృష్టి సారిస్తే బావుండేది.

విశ్లేషణ...
కుమారుడికి జరిగిన అన్యాయానికి ఓ తండ్రి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే 'పటేల్ సర్' సినిమా ప్రధాన ఇతివృత్తం. కథ కాస్త వైవిధ్యమైందే. ముఖ్యంగా అందులో ఉన్న ఎమోషన్‌ను తెరపై బాగా పండించారు. సినిమా మొదటి భాగం మొత్తం. రెండు, మూడు హత్యలు. పాటలతోనే నడుస్తుంది. రెండో భాగం ప్రేక్షకులకు కాస్త ఉత్సాహాన్నిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్‌ను బాగా చూపించారు. మొత్తం మీద వైవిధ్యభరితమైన కథలు, ఫ్యామిలీ సెంటిమెంట్‌ను ఆదరించే ప్రేక్షకులను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది.

నచ్చినవి...
జగ్గు భాయ్

నచ్చనివి...
ఎడిటింగ్
సంగీతం

చివరగా...
ఒక మాములు సినిమా