"నేల టిక్కెట్టు" సినిమా రివ్యూ

చిత్రం: నేల టిక్కెట్టు
రేటింగ్: 2.0/5.0
సంగీతం : శక్తికాంతి కార్తిక్
దర్శకత్వం : కళ్యాణ్‌కృష్ణ
నిర్మాతలు: రామ్ తాళ్ళూరి

స్టారింగ్ : రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం, పోసాని తదితరులు

సోగ్గాడే చిన్ని నాయనా, రారాండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వరుస హిట్స్ అందుకున్న కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఈ "నేల టిక్కెట్టు" సినిమాపై రవితేజ అభిమానులకే కాకుండా అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా మాస్ కమర్షియల్ సినిమాలు చేసే హీరో రవితేజ ఈసారి తన సినిమా ద్వారా ఓ సందేశం కూడా చెప్పాలనుకున్నాడు.మరి ఎలా చెప్పాడో ఈ నేల టికెట్టు మెప్పించిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం!

కథలోకివెళితే...
హీరో రవితేజ (నేల టిక్కెట్టు) ఓ అనాథ. చుట్టు జనంలో ఉన్న ప్రతి ఒక్కరినీ తనవాళ్లని అనుకుంటుంటాడు. అనాధ కావడంతో ఏ ఒక్కరు తనను వరస పెట్టి పిలిచినా వారికోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతాడు. కొన్ని కొన్ని సార్లు గొడవల్లో కూడా ఇరుక్కుంటాడు. అలా ఓ పోలీస్ ఆఫీసర్‌తో గొడవ పడి వైజాగ్ నుండి హైదరాబాద్‌కు వచ్చేస్తాడు. అక్కడ తెలియకుండానే హోం మినిస్టర్ ఆదిత్య భూపతి (జగపతిబాబు) మనుషులతో గొడవ పెట్టుకుంటుంటాడు. ఆదిత్య భూపతి హోం మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ప్రజలకు సేవ చేయాలనుకునే తన తండ్రి ఆనంద భూపతి (శరత్ బాబు)ని చంపేస్తాడు. ఆ ఫుటేజ్ టీవీ రిపోర్టర్ గౌతమీ (కౌముది)కి దొరుకుతుంది. దీంతో ఆమెను చంపాలని ప్రయత్నిస్తారు మినిస్టర్ మనుషులు. ఈ క్రమంలో ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. అసలు హోం మినిస్టర్‌కి రవితేజకు గొడవ ఏంటి? హోం మినిస్టర్ ఆగడాలను ఎందుకు బయటపెట్టాలనుకుంటాడు? అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటులఫర్ఫార్మెన్స్...
రవితేజ ‘నేల టిక్కెట్’గా చేయగలిగిన దానికంటే ఎక్కువే చేసాడు. కానీ ఒక దశకి చేరిన తర్వాత అతని ఎనర్జీ కూడా కాపాడలేనంత నిస్సారంగా వున్న కథ, కథనాల వల్ల మాస్‌ మహారాజా కూడా చూస్తుండిపోయాడు. అతని ఆహార్యంలో, నటనలో గత చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. హీరోయిన్ లుక్స్ పరంగా ఆకట్టుకుంటుంది. నటన పరంగా మాత్రం అమ్మడు మరింత పరిణితి చెందాల్సివుంటుంది. సినిమాలో బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, పోసాని వంటి సీనియర్ కమెడియన్లు ఉన్నా.. ఆ స్థాయి కామెడీ పండించలేకపోయారు. పృధ్వీ, జ్యోతిలతో చేసిన కామెడీ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది.జగపతి బాబు ఎప్పటిలానే తన పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన తారాగణం తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికపరంగా...
కథాకథనాల్లో విషయం లేకపోతే సాంకేతిక నిపుణులు కూడా ఏమాత్రంశ్రద్ధ పెట్టి పని చేస్తారో చెప్పడానికి 'నేల టికెట్టు' రుజువుగా నిలుస్తుంది. సాంకేతికంగా కూడా అన్ని రకాలుగా నిరాశ పరుస్తుంది. సినిమాలో పాటలు సాదాసీదాగా ఉన్నాయి. ఒక్క 'ఐ లవ్ యు' పాట మాత్రమే అంతో ఇంతో మేలనిపిస్తుంది. మిగతావన్నీ తేలిపోయాయి. ఛాయాగ్రహణం కూడా ఏమంత ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ...
ఓ అనాధ తనను చేరదీసిన వ్యక్తిని డబ్బు కోసం చంపాలనుకుంటాడు. డబ్బు మాత్రమే జీవితమనుకొని బ్రతుకుతుంటాడు. మరో అనాధ చుట్టూ మనుషులు ఉండాలి వారి కోసం ఏమైనా చేయాలని ఆలోచించే మనస్తత్వం గలవాడు. ఈ ఇద్దరికీ మధ్య జరిగే సంఘర్షనే ఈ 'నేల టికెట్'. అయితే సినిమా మొదలైన కొద్దిసేపటికే అసలు 'సోగ్గాడే చిన్న నాయన', 'రా రండోయ్ వేడుక చూద్దాం' సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకుడేనా ఈ సినిమా డైరెక్ట్ చేసిందనే అనుమానాలు కలుగుతాయి.
మాస్‌ ప్రేక్షకులు కామెడీతో సంతృప్తి పడిపోయినా.. కొత్తదనం కోరుకునే వారిని మాత్రం ఈ సినిమా మెప్పించదు.

నచ్చినవి...
రవితేజ నటన
కామెడి

నచ్చనివి...
కథ
కథనం
స్కీన్ ప్లే

చివరగా...
మాస్ ఆడియన్స్ కూడా మెప్పించలేదు ఈ "నేల టిక్కెట్టు"