దసరా నవరాత్రులు

యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
అని మనం స్తుతించే మహాశక్తి పేరు “దుర్గా” అని, ఈ అనంతసృష్టికి మూలమని మన పురాణాల్లో చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి ఆ దేవి అంశలేనని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మిగతా దేవి దేవతలంతా ఆమె నుండే ప్రభావించారని ఉల్లేఖించబడింది.

ఐం అనే బీజాక్షరం సరస్వతీదేవికి, హ్రీం అనే బిజాక్షరం పార్వతిదేవికి, క్లీం అనే బీజాక్షరం లక్ష్మీదేవికి ప్రతిరూపాలని ,అందుకే ఈ మూడింటిని కలిపి 'ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే' అనే దేవి నవార్ణ మంత్రాన్ని సృష్టించి మనకందించారు ఋషులు. ఈ మంత్రాన్ని సర్వదా జపిస్తుంటే విద్య, యశస్సు, ధన, ధాన్యసంపదలు కలిగి ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారని చెప్పటం వల్ల మహిమాన్వితం, శుభప్రదం అయింది.

ఆ జగన్మాతనే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మడా, స్కంధమాతా, కాత్యాయని, కాళరాత్రి(శుభంకరి), మహాగౌరి, సిద్ధిధాత్రి అనే నవదుర్గలుగా పూజిస్తున్నాం. హిమవంతుని కుమార్తె , విద్యను గ్రహించేది, అనుగ్రహించేది, అర్ధచంద్రుడిని జడలో ధరించేది , గుమ్మడికాయ వంటలను ఇష్టంగా ఆరగించేది, కుమారస్వామి తల్లి , దుష్టనాశిని , శుభంకరి, మహాగౌరి అనే ఎనిమిది సంవత్సరాల వయస్సులో శ్వేత శుభ్ర వస్త్రధారిణి ,అష్టసిద్ధులు (అణిమ,మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇష్విత, మహిత్వ)గల దేవిగా మనం పూజిస్తున్నాం.

దుర్గా దేవి రూపం
దుర్గాదేవి రూపం మనకు చిరపరిచితమే .పది చేతులతో కత్తి, శంఖం, త్రిశూలం,గంట, పానపాత్ర, ధనుర్భాణాలు, డాలు,మొదలైన ఆయుధాలు ధరించి, సింహవాహనం అధిష్టించి ఎర్రని చీరతో మెడలో ఎన్నో ఆభరణాలతో ,వ్రేలాడుతున్న నల్లని కేశపాశంతో కరండ మూక్తగా, శిరస్సుపై కిరీటంతో మహిషాసుర వధ చేస్తున్న దేవి ప్రతిమలను విజయదశమి నాడు పూజలు చేస్తాం.

ఇక దేవి ప్రాశస్త్యం వర్ణించనలవి కాదు.జగన్మాత సర్వశక్తి స్వరూపిణి .ఆరాధించే వాళ్లకు ఙ్ఞానాన్ని ప్రసాదించి ,వారిలోని కుండలినీ శక్తిని జాగృతం చేస్తుంది.ఆ జగదాంబ ఎవరికి అర్ధం కాని,అవధులు లేని మహోన్నత శక్తిస్వరూపిణి. అఖిలండకోటి బ్రహ్మాండనాయకీ, నిరంతర చలనం గల ప్రాకృతిక చైతన్య స్త్రీ రూపం.

మొట్టమొదట ప్రకృతిగా ,ఆ ప్రకృతిలోని కాంతి పుంజం నుండి ఆవిర్భవించి చరాచర జగత్తునంతటినీ సృష్టించిందని ,అన్నింటిలోనూ శక్తిని నింపిందని మన ఆగమశాస్త్రాలు ,పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. అన్ని జీవుల్లో ,భౌతిక పదార్ధాల్లోను శక్తి ఉందని మన మహర్షులు వేలకోట్ల సంవత్సరాల క్రితమే చెప్పగా ,ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఆ మధ్య కనుగొన్నారు.

"అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ " అని పోతన
"శ్రీ వా గిరిజాశ్చిరాయ..." అని నన్నయ
"శ్రీయన గౌరినాపరగు చెల్వకు చిత్తము పల్లవింప..." అని తిక్కన ప్రశంసించారు.

దేవి సకల సృష్టి , స్థితి ,లయకారక మూలశక్తి కాబట్టి కొందరు ఊహిస్తునట్టు సంవత్సరంలో మొదటి ఆరు నెలలు పురుష రూపాత్మకం ,తరువాతి ఆరునెలలు స్త్రీ రూపాత్మకం అని విడదీయలేము.
పూరాణ .చారిత్రక ఆధారాలు

సీత, శ్రీరాముడు దుర్గను ఆరాధించినట్టు రామాయణంలో ఉంది. అలాగే రుక్మిణిదేవి, శ్రీకృష్ణుడు మాతను పూజించేవారని మహాభారతంలోను ,బ్రహ్మవైవర్త పురాణంలోనూ చెప్పబడింది. మధుకైటభుల బారి నుండి బయట పడటానికి బ్రహ్మదేవుడు, త్రిపురాసుర సంహారం కోసం పరమశివుడు పూజించి విజయులయ్యారు.శివుడు ఆ గెలుపు తర్వాతనే దేవికి కృతఙ్ఞతగా అర్ధనారీశ్వరుడయ్యాడట. దూర్వాసుడి శాపం నుండి విముక్తి కలగటానికి ఇంద్రుడు కూడా ఈ శక్తిని అరాధించాడు.అలాగే ఎందరో మునులు , సిద్ధులు, మహర్షులు కూడా దేవిని ఆశ్రయించినవాళ్ళే.

విజయదశమి
హిందూ సామ్రాజ్య స్థాపనకు కంకణం కట్టుకున్న ఛత్రపతి శివాజీ ,మన శ్రీకృష్ణదేవరాయలు విజయదశమి పర్వదినాలలో జైత్రయాత్రలు చేసేవారట.హంపీలో రాయలు కట్టించిన "దసరా దిబ్బ" ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
ఆశ్వయుజ దశమినే విజయదశమి అంటారు.భక్తుల న్యాయమైన మంగళకరమైన కోర్కెలు తీర్చి, శుభాలు ప్రసాదిస్తుంది.అందువల్లనే అమెకు సర్వమంగళ అనే పేరు కూడా వచ్చింది.దుర్గా నవరాత్రుల సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమై నవమితో ముగిసే "బతుకమ్మ" పండగ కూడా ఆ గౌరీ దేవి గురించి ఆడపడుచులు చేసేదే.

దసరా నవరాత్రులలో దుర్గాపూజ చేసి "కన్యా పూజ" అంటూ 10 సంవత్సరాల వయస్సులోపు ఆడపిల్లల్ని పిలిచి మృష్టాన్న భోజనాలను పెట్టి, కానుకలిస్తారు.ఇలా చెయ్యడమే పూజకు ఉద్యాపన.