త్వరలో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు!!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు.వచ్చే ఎన్నికలకు పార్టీ నేతలందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని తన నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ పార్టీల బలాబలాలను ఆయన విశ్లేషించారు. గతేడాదితో పాల్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 16.13 మేరకు పెరిగిందని, వైకాపా ఓట్ల శాతం 13.45 మేర తగ్గిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క శాతానికే పరిమితమైందని అన్నారు. ఇక ఎన్నికలే అజెండాగా నేతలందరు ప్రజల్లోకి వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. నేతలు పోటీతత్వంతో పని చేస్తే అదే విధంగా తానూ ప్రోత్సహిస్తానన్నారు. ఇకపై తాను సాయంత్రం 6 గంటల తర్వాత పార్టీకే సమయం కేటాయించినున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రంలోగా జిల్లాలకు ఇన్‌చార్జీ మంత్రులను కేటాయిస్తానన్నారు. ప్రతి నెల ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఓటు బ్యాంకును బ్యాంకును కాపాడుకుంటూనే పార్టీని బలోపేతం చేయాలన్నారు. పొగడ్తలు ఆపి, పని మీద దృష్టి పెట్టాలంటూ తమ పార్టీ నాయకులకు టీడీపీ అధినేత చంద్రబాబు చురకలు అంటించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు పార్కీఇ చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకులకు తాము బాగుపడితే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో సుజయకృష్ణ రంగరావు సమావేశం నిర్వహిస్తే ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారని, ఇలా చేయడం కలెర్టు కాదని అన్నారు. ఇసుక విషయంలో పార్టీకి, ప్రభుత్వానికి వచ్చిన చెడ్డపేరును తొలగించేందుకు తాను చాలా కష్టపడిన విషయాన్ని చంద్రబాబు ఈ సంరద్భంగా ప్రస్తావించారు. ఈ భేటీలో పాల్గొన్న నాయకులు కొందరు మాట్లాడుతూ, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా లోకేష్‌ బాధ్యతలు స్వీకరించాక అధికారుల్లో మరింత చలనం వచ్చిందని అన్నారు. దీంతో, చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ భేటీలో లోకేష్‌ కూడా పాల్నొడం గమనార్హం. గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని, సంస్థాగత ఎన్నికల నిర్వహణ విషయంలో ఇన్‌చార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని లోకేష్‌ సూచించారు.