"తేజ్ ఐ లవ్యూ" సినిమా రివ్యూ

చిత్రం: తేజ్ ఐ లవ్యూ
రేటింగ్: 1.5/5.0
బ్యానర్ : క్రియేటివ్ కమ్మర్షియల్స్ మూవీ మేకర్స్
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : కరుణాకరన్
నిర్మాతలు: కె.ఎస్.రామారావు

స్టారింగ్ : సాయి ధరమ్ తేజ్ , అనుపమ పరమేశ్వరన్, జయప్రకాష్,పవిత్రా లోకేష్, వివా హర్ష, సురేఖావాణి, పృధ్విరాజ్ తదితరులు

రెండేళ్లుగా వరుస ఫ్లాప్‌లు పలకరిస్తుండటంతో, ఈసారి క్యూట్ లవ్ స్టోరీతో ఐ లవ్యూ అంటున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్.రామారావు నిర్మించిన కరుణాకరన్ డైరెక్టర్ చేసిన "తేజ్ ఐ లవ్యూ" సినిమాతో చాలా జాగ్రత్త;ఉ తీసుకుని మరీ ఒక హిట్ కోసం ఈ రోజు మన ముందుకు వచ్చాడు సాయి ధరమ్ తేజ్. మరి ఈ సినిమా అన్నా హిట్టా లేక మళ్ళీ ఫట్టా అనేది ఈ రివ్యూలో చూద్దాం....

కథలోకివెళితే...
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ్, ఆ చిన్న వయసులోనే ఓ మహిళను దుండుగుల బారి నుంచి కాపాడే ప్రయత్నంలో హత్య చేసి ఏడేళ్ల శిక్ష అనుభవిస్తాడు. తన భర్త(అనిష్ కురువిల్ల)కు జరిగింది చెప్పి తన ప్రాణాలను కాపాడిన పిల్లాడి కోసం భారీ మొత్తంలో చెక్కు రాసిచ్చి ఆమె లండన్ వెళ్తుంది. కానీ ఆమె భర్త మాత్రం ఆ డబ్బును హీరో కుటుంబానికి ఇవ్వకుండా తన స్వార్థంతో కూతురి పేరిట ఆస్తులు కొని లండన్ వెళ్తాడు. చాలా ఏళ్ల తర్వాత అసలు విషయం తెలిసిన ఆమె బాధతోనే విదేశాల్లోనే కన్నుమూస్తుంది. చనిపోయే ముందు తన కూతురైన నందిని (అనుపమ)కి అసలు విషయం చెబుతుంది. తన తల్లి ప్రాణాలను కాపాడిన అబ్బాయిని వెతుక్కుంటూ ఇండియా వచ్చిన నందిని హీరో తేజ్‌తో ప్రేమలో పడుతుంది. ప్రపోజ్ చేయడానికి వెళ్తూ యాక్సిడెంట్‌లో గతాన్ని మర్చిపోతుంది. తర్వాత తను వెతుకుతున్న అబ్బాయి హీరోనే అని హీరోయిన్ ఎలా తెలుసుకుంది? అనేది మిగిలిన కథ...

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
హీరో సాయి ధరమ్, అనుపమ పరమేశ్వరన్ బాగా నటించారు. నందిని పాత్రలో అనుపమ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇంట్లో చెల్లెళ్లతో, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే యువకుడిగా తేజ్ పాత్రలో సాయి మెప్పించాడు. హీరో పెదనాన్నగా జయప్రకాష్, పెద్దమ్మగా పవిత్రా లోకేష్ నటన ఆకట్టుకునేలా ఉంది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. తేజ్ పిన్నిగా వాణి సురేఖ, బాబాయిగా పృథ్వీ తమ పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికపరంగా...
ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్‌గా సినిమాను నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్ బాగుంది. రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాట్రోగ్రాఫర్ ఆండ్రూ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. హీరోయిన్‌ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ ఫర్వాలేదనిపించాడు. కానీ రొటీన్ కథ, దారి తప్పిన కథనంతో తన మార్క్ చూపించలేకపోయాడు. ప్రేక్షకుడిని కన్విన్స్ చేయలేకపోయాడు.

విశ్లేషణ...
భారీ అంచనాలను అందుకోవడంలో, తన గత సినిమాల మ్యాజిక్‌ను రిపీట్ చేయడంలో డైరెక్టర్ కరుణాకరన్ సక్సెస్ కాలేకపోయాడు. కానీ పెద్దగా బోర్ కొట్టకుండా, సరదాగా చూడాలని అనుకునే వాళ్లు మాత్రం ఓసారి తేజ్‌ను చూసేయొచ్చు. కానీ తొలిప్రేమ లాంటి అద్భుతమైన సినిమాను కరుణాకరన్ నుంచి ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.

నచ్చినవి...
అనుపమ
తేజ్ నటనలో పరిపక్వత

నచ్చనివి...
రోటీన్ కథ
స్క్రీన్ ప్లే

చివరగా...
తేజా We Love U but Not Like This