తెరమీదికి ఎమర్జెన్సీ!!

'ఎమర్జెన్సీ విధించిన రోజు ఏ ప్రజాస్వామ్య ప్రేమికుడూ మరచిపోలేని 'కాళరాత్రి'.. ప్రజాస్వామ్యం అంటే ఓ వ్యవస్థ మాత్ర మే కాదు.. మన సంస్కృతిలో భాగం అనేది కూడా వాస్తవమే. సామాజిక వ్యవస్థ పరిరక్షణకు నిరంతర నిఘా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.1975 జూన్‌ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన 'ఎమర్జెన్సీ'ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్రమోదీ తన నెలవారీ 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజమే. ఆ రకంగా ఇందిరా గాంధీ హయాంలో ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీని తెర మీదికి తెచ్చి, పరోక్షంగా కాంగ్రెసును దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. అది ఫలించినట్లే కనిపిస్తోంది.ప్రజాస్వామ్యానికి హాని కలిగించే ఇలాంటి ఘటనలను తప్పకుండా గుర్తుపెట్టుకుని దాని పటిష్టత కోసం ముందుకు సాగాలన్న ప్రధాని నరేంద్రమోదీ హయాంలో సాగుతున్న పాలన తీరు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది.ఆంక్షలతో ప్రభుత్వం ముందు మీడియా ముందు మోకరిల్లుతున్నదన్న మోదీ హయాంలోనే దేశంలోని ప్రముఖ ఎన్డీటీవీ చానెల్‌ వ్యవస్థాపకుడు ప్రణయ్‌ రాయ్‌ ఇంటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులు జరిపిన నేపథ్యం.. ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్నదని విమర్శకులు అంటున్నారు.మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో అద్యంతం 'ఎమర్జెన్సీ'ని గుర్తు చేస్తూ ప్రసంగం సాగించిన మోదీ హయాంలో ప్రభుత్వ వ్యతిరేక వాణి వినిపించిన వారిపై 'జాతి ద్రోహులు', 'దేశ ద్రోహులు' అని ముద్రలు వేస్తూ ఎదురుదాడి చేస్తున్నది. ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి సాధారణ విద్యాసంస్థల్లో స్వేచ్ఛ కోసం విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనల్లోనూ కేంద్ర ప్రభుత్వానికి దేశ ద్రోహం కనిపిస్తున్నదని విపక్షాలు అంటున్నాయి. ఇక మరో కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు మరో అడుగు ముందుకు వేసి 'ఎమర్జెన్సీ'ని పాఠ్యాంశంగా చేర్చాలనే వాదన తీసుకొచ్చారు.'ప్రధాని మోదీ ఎమర్జెన్సీ రోజులను ప్రస్తావిస్తున్నారు. మాకు ఆ రోజులు గుర్తున్నాయి. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని మేం అంగీకరించాం. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రధాని మాకు ఆ రోజుల గురించి గుర్తు చేసే బదులు తనను తాను సరిదిద్దుకోవాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే.. జరిగిన పొరపాట్లు పునరావృతమవుతాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది' అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టామ్‌ వడక్కన్‌ తెలిపారు.మనదేశ అంతర్గత భద్రత అపాయంలో పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులకు మధ్య అనుబంధం అంతకంతకు బలోపేతం అవుతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిలిటెంట్‌ కార్యక్రమాల్లో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు చురుగ్గా పాల్గొంటున్నా మోదీ సర్కార్‌కు చీమ కుట్టినట్లయినా లేదని చెప్తున్నారు. కశ్మీర్‌ లోయలో కుహానా వేర్పాటు వాదులు పూర్తిస్తాయి ఉగ్రవాదులుగా రూపాంతరం చెందుతున్నారు. దీనికి జమ్ముకశ్మీర్‌లోని అధికార పీడీపీ ప్రభుత్వం పూర్తిగా అండదండలనిస్తుంటే దాని మిత్ర పక్షం బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా జాతీయవాదం, దేశ భక్తి గురించి కబుర్లు చెప్తున్నదని విమర్శలు ఉన్నాయి. ఇటీవల రంజాన్‌ మాసం చివరి శుక్రవారం నాడు మసీదు వద్ద విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీని అల్లరిమూక కొట్టి చంపే స్థాయికి ద్వేషం పెరిగిపోతున్నా కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నదని ఆరోపణ.ఇటీవల సిక్కు నుంచి నాథు లా పాస్‌ మీదుగా కైలాస్‌ మాన సరోవర్‌ ఆలయానికి వెళ్లడానికి వెళుతున్న 50 మంది భారత యాత్రికులు వెళ్లకుండా చైనా అడ్డుకోవడంతో పొరుగుదేశాలతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సంబంధాలు దెబ్బతింటున్న పరిస్థితి నెలకొన్నది. సరిహద్దుల్లోని పాకిస్థాన్‌ నుంచి ఒకే సమయంలో ఇటు మిలిటెంట్లు చొరబాట్లకు పాల్పడుతుండగా, మరోవైపు పాక్‌ రేంజర్లు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఇక ప్రజాతంత్ర సంస్థల విలువలనూ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని విమర్శలు ఉన్నాయి.రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం దాద్రిలోని ఒక ఇంటిలో 'బీఫ్‌' దాచిపెట్టారని ఆ కుటుంబంపై దాడి జరిగింది. ఆ దాడిలో కుటుంబ యజమాని మరణించాడు. ఇదే రాష్ట్రం సహరాన్‌పూర్‌లో బీఆర్‌ అంబేద్కర్‌ సాక్షిగా దళితులపై ఠాకూర్లు దాడికి పాల్పడ్డారు. ఇక వివిధ అంశాలపై ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు విపక్ష నేతలు వెళ్లకుండా శాంతిభద్రతల పేరిట అడ్డుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. ఇక గుజరాత్‌ రాష్ట్రం ఉనాలో ఆవులను చంపేశారని గోరక్షకుల పేరిట దళితులను బహిరంగంగా కొట్టి చంపిన ఘటన చోటు చేసుకున్నది.అదే గుజరాత్‌ రాష్ట్రంలో పటేళ్లు తమకు విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పాటిదార్లు ఆందోళనకు దిగితే దాన్ని అణచివేసేందుకు ఆందోళనకు నాయకత్వం వహించిన హార్దిక్‌ పటేల్‌పై నాటి ఆనందీబెన్‌ పటేల్‌ ప్రభుత్వం 'దేశ ద్రోహం' కేసు నమోదుచేసింది. ఆరు నెలల పాటు రాష్ట్రం నుంచి బహిష్కరిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అంతటితో ఆగలేదు. ఒకవైపు తమ ప్రభుత్వ పాలన సాగిస్తూనే మరోవైపు పటేళ్లపై అణచివేతకు పాల్పడుతున్నారు.