'తూర్పు'పై దృష్టి సారించిన జనసేన అధినేత

ప్రశ్నించడం ద్వారా సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న పర్యటనలకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.రాబోయే ఎన్నికలకు జనసేన పార్టీని సిద్ధం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ రంగం సిద్ధం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని క్షేత్రస్ధాయి నుండి బలోపేతం చేసే దిశగా జనసేనాని పవన్‌కళ్యాణ్‌ ప్రణాళికలు వేస్తున్న ముఖ్యంగా ఆయన దృష్టంతా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలపైనే కేంద్రీకరించారు.పవన్‌కళ్యాణ్‌కు కోస్తాంధ్ర జిల్లాల్లో ఉన్న ఆదరణను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు.జనసేన పార్టీని స్ధాపించిన నాటి నుండి నిజాయితీపరులు, అనుభవజ్ఞులకే చోటు ఉంటుందనే అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తీకరిస్తున్నారు.పార్టీని పటిష్టపరిచే దిశగా వివిధ జిల్లాల్లో రాజకీయాలలో నిస్వార్ధపరులను సేకరించే దిశగా జనసేన ఎంపిక శిభిరాలను ఏర్పాటు చేస్తున్నారు.ఈ మేరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో 2వ విడతగా 5 జిల్లాల్లో ప్రతిభా పాటవ శిభిరాలను నిర్వహించి జౌత్సాహికుల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నారు.ఈ మేరకు తూర్పుగోదావరిజిల్లా ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో తెలంగాణాలో అదిలాబాద్‌(పాతజిల్లా పరిధి), నిజామాబాద్‌(పాత జిల్లా పరిధి), శిభిరాలను నిర్వహిస్తున్నారు.తొలి విడతలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనంతపురంలో నిర్వహించిన శిభిరాలకు స్పందన రావడంతో మలి విడత ఈ ఐదు జిల్లాలపై జనసేనాని దృష్టి కేంద్రీకరించారు.సినీ గ్లామర్‌తో పాటు సామాజికవర్గానికి చెందిన మద్దత్తును కూడా కూడగట్టుకునేందుకు ఆయన తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాలను కేంద్రంగా ఎంచుకున్నారు.గత ఏడాది సెప్టెంబర్‌ 9న కాకినాడ జెఎన్‌టియు మైదానంలో జనసేనాని నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.దేశ రాజకీయాలను ప్రగతి పధంలో మళ్లింపచేయాలనే ఆశ, ఆలోచన ఉన్నవారంతా తమ ధరఖాస్తులను జూన్‌ 3వ తేదీ లోగా ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రకటించారు.మే 30 నుండి ప్రారంభమైన ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే విశేష స్పందన లభిస్తోంది.ధారాళంగా మాట్లాడే వక్తలు కంటెంట్‌ రైటర్‌, విశ్లేషకుల విభాగాలకు జనసేన ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తులను స్వీకరించిన అనంతరం వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది.ధరఖాస్తుల పరిశీలన, తదితర అంశాలను పర్యవేక్షించేందుకు పార్టీ కోశాధికారి, పవన్‌కళ్యాణ్‌ సభల పర్యవేక్షకుడు రాఘవయ్య, ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, జనసేవాదళ్‌ ఇన్‌చార్జ్‌ రియాజ్‌లతో పాటు మీడియా హెడ్‌ హరిప్రసాద్‌లను నియమించారు.పార్టీ కార్యాలయానికి సంబంధించి నరసింహ, నగేష్‌లు ఈయనకు సహాయ సహకారాలు అందిస్తారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిభిరాల ద్వారా వచ్చిన ధరఖాస్తులు, జౌత్సాహికుల పరిశీలనకు ఈ కమిటీ త్వరలో తూర్పుగోదావరిజిల్లాలో పర్యటించనుంది.కాకినాడలో నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన సమన్వయకర్తలు కామిరెడ్డి రాజేష్‌, చింతపల్లి అర్జున్‌, అడ్డాల, వై.శ్రీను, చింతపల్లి బన్నిల ద్వారా ఇప్పటికే కొంత సమాచారాన్ని జనసేనాని పార్టీ కార్యాలయం సేకరించింది.ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ప్రస్తుత టిడిపి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న నేపధ్యంలో ఆయా వర్గాలను కలుపుకుని వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది.తెలుగుదేశం పార్టీ కాపు సమస్యలపై దృష్టి కేంద్రీకరించడంలో వైఫల్యం చెందిందని కాపు సామాజిక వర్గాలు వైకాపా వైపు దృష్టి సారిస్తున్నాయి.మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో వైకాపా అధినాయకత్వం కొంత వరకు సంప్రదింపుల స్ధాయిలో ఉంది.శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితుల సమస్యలు, అమరావతిలో భూ సేకరణలో స్ధలాలు కోల్పోయిన రైతుల సమస్యలు, అనంతపురంలో చేనేత కార్మికుల సమస్యలపై గళం విప్పిన జనసేనాని జిల్లాలో ప్రధానంగా ఉన్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించారు.ఈ మేరకు విలీనమండలాల్లో ఉన్న సమస్యలు, పోలవరం భూ సేకరణలో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలు జనసేనాని దృష్టికి వచ్చాయి.ఈ అంశాలపై ఆయన దృష్టి కేంద్రీకరిస్తూ రాబోయే రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు.ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే, పార్టీని క్రింది స్ధాయి నుండి పటిష్టపరిచేలా వ్యూహ రచన చేయనున్నారు.రాజకీయ పార్టీగా రాబోయే ఎన్నికల్లో జనసేనను ఏ మేరకు పటిష్టపరుస్తారో, విజయం సాధిస్తారో అన్నది వేచిచూడాల్సి ఉంది.