తన భర్త నుంచే దీపకు షాక్‌

జయలలిత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఆమె మేనకోడలు దీపకు ఆమె భర్త మాధవన్‌ నుంచి ఊహించని షాక్‌ ఎదురైంది. జయలలిత మరణం తర్వాత దీప ఎంజీఆర్‌ అమ్మ దీప ఫెరవై పేరుతో ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో దీప భర్త మాధవన్‌ ఆమెతో విభేదించారు. సదరు పోలిటికల్‌ ఫోరంలో తాను కొసాగనని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జయలలిత సమధి వద్దకు వెళ్లి, శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం మాధవన్‌ మాట్లాడుతూ తానొక కొత్త పార్టీ నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. దీపను కొన్ని దుష్ట శక్తులు ప్రభావితం చేస్తున్నాయని వారి విధానాలు నచ్చకే తను దీప స్థాపించిన రాజకీయ వేదిక నుంచి వైదొలుగుతున్నట్లు మాధవన్‌ తెలిపారు. మరోవైపు దీప ఇప్పటికే తాను ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన భర్త నుంచే ఇలా ఎదురుదెబ్బ తగలడంతో ఆమె డైలమాలో పడ్డారు. ఫిబ్రవరి 24న దీప ఎంజీఆర్‌ అమ్మ దీప పెరవై పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. జయలలిత పుట్టిన రోజు నాడు ఆమె ఈ ప్రకటన చేశారు. అయితే అనంతరం తిరిగి అనేక పరిణామాల నేపథ్యంలో ఆమె పన్నీర్‌ సెల్వంకు మద్దతు తెలిపారు. కాని ప్రస్తుతం ఆమె ఆ వర్గానికి కూడా దూరంగానే ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలన్ని శశికళ వర్గం చెప్పు చేతుల్లో ఉండడంతో ఎలాగైన దీప ఆ ఆపర్టీని దక్కించుకోవాలని, ఆర్కే నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలిచి జయలలితకు నిజమైన రాజకీయ వారసురాలిగా నిరూపించుకోవాలని భావిస్తున్నారు.