ట్రంప్‌ వీసాల వేటుకు 7 కంపెనీలకు షాక్‌

అమెరికాలోని ఏడు భారత ఐటీ కంపెనీలకు హెచ్‌1బీ వీసాల్లో భారీగా కోతపడింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 2016లో 37 శాతం దరఖాస్తులు తగ్గాయట. అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం వీసాల జారీతో కఠినతరం ఆంక్షలు విధించడంతో క్రితం సారి కన్నా అధికంగా 5436 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (ఎన్‌ ఎఫ్‌ ఏపీ) అనే సంస్థ వెల్లడించింది. ఏప్రిల్‌లో ట్రంప్‌ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత సేకరించిన అధికారిక గణాంకాలను ఈ సంస్థ ఇటీవల విడుదల చేసింది. స్థానికులకే ఉద్యోగాలు అన్న నినాదంతో స్థానికులకు అదనపు అవకాశాలు కల్పించేందుకు అమెరికా ప్రభుత్వం హెచ్‌1బీ వీసాలను గణనీయంగా తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రారంభమైన హెచ్‌1బీ వీసా ఆంక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా తమ దరఖాస్తులను భారీగా తగ్గించుకుంటున్నాయి. వీసా నిబంధనలను కఠినతరం చేయడం ఇటు నిర్వహణ వ్యయాన్ని పెంచడమే కాకుండా అటు ప్రతిభావంతులైన ఉద్యోగులను అమెరికాకు తరలించడం కూడా కష్టతరమవుతున్నదని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. అమెరికాలో స్థానిక నియామకాలను పెంచే దిశగా అవి చర్యలు ప్రారంభించాయి. ఇన్ఫోసిస్‌ ఇప్పటికే రానున్న రెండేళ్లలో 10 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. స్వదేశీ రక్షణ విధానం పెరుగుతున్న సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలోనూ వారి బిజెనెస్‌ మోడల్స్‌కు తగ్గినట్లుగా సర్దుబాటై, వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి