టీఆర్‌ఎస్‌లోకి రమేష్‌ రాథోడ్‌ !

29న కారెక్కేందుకు ముహుర్తం ఖరారు

ఆదిలాబాద్‌ జిల్లాలో టీడీపీ పార్టీకి అండదండగా ఉన్న కీలక నేత, పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు రమేష్‌రాథోడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. ఈ నెల 29న కారెక్కేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఆ రోజున జిల్లావ్యాప్తంగా ఉన్న క్యాడర్‌తో కలిసి ఆయన గులాబీకండువా వేసుకోబోతున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రమేష్‌రాథోడ్‌తోపటు ఆయన భార్య, మాజీ ఎమ్మెమ్యే సుమన్‌ రాథోడ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆయన కుమారుడు రితేష్‌ రోథోడ్‌, ఆదిలాబాద్‌ కుమరంభీం నిర్మల్‌ జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఒప్పుడు టీడీపికి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆ పార్టీకి గడ్డు కాలం వచ్చినట్టే! టీడీపీలో ఒకప్పుడు కీలకంగా ఉన్న వేణుగోపాలచారీ, జోగు రామన్న, నగేష్‌ వంటి నేతలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. రమేష్‌రాథోడ్‌ ఒక్కడే పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరబోతుండడం టీడీపీకి పెద్ద దెబ్బే!నిజానికి సాధారణ ఎన్నికలలో రమేష్‌రాథోడ్‌ ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి, ఆయన కుమారుడు రితేష్‌ రాథోడ్‌ ఖనాపూర్‌ అసెంబ్లీ నియోజవకర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీకి బలమైన క్యాడర్‌ ఉండి కూడా ఓడిపోవడాన్ని వారు తట్టుకోలేకపోయారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. ఆ ప్రచారాఇ్న రమేష్‌రాథోడ్‌ ఖండిస్తూ వచ్చారు. కేంద్రంతో తమ పార్టీ భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏదో ఒక నామినేటెడ్‌ పదవి లభిస్తుందని ఆశపడ్డారు. ఒ దశలో కేంద్ర గిరిజన సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వరించబోతున్నట్టు ఉహగానాలు వెలువడ్డాయి. కారణాలు ఏమైనా నామినేటెడ్‌ పదవి దక్కలేదు. తెలంగాణలో టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు అంతగా లేకపోవడంతో రాథోడ్‌ శిబిరంలో ఓ విధమైన నైరాశ్యం ఏర్పడిందట. దీంతో టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భావన ఏర్పడడం ఈనేపథ్యంలోనే రమేష్‌రాథోడ్‌ కాంగ్రెష్‌లో చేరుతారన్న ప్రచారం తెరపైకి వచించింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో మాట్లాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు కాని కాంగ్రెస్‌లో చేరతానన్న అంశం క్రమేణా మరుగుపడిపోయింది. ఆ తర్వాత బీజేపీ అధిష్ఠానం కూడా గాలం వేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే ఎవరూ ఉహించని విధంగా రమేష్‌ రాథోడ్‌ గులాబీగూటికి చేరుబోతుండడం జిల్లాలోని నేతలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.