జూలైలో రజనీకాంత్‌ కొత్త పార్టీ?

తమిళనాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశానికి దాదాపు ముహూర్తం ఖరారైంది. జూలైలో రజనీ తన కొత్తపార్టీని అధికారికంగా ప్రటించనున్నట్టు ఆయన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్‌ వెల్లడించారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుంటున్నారు. ఈ విషయంపై రజనీ తన అభిమానులను, శ్రేయోభిలాషులను కలిపి వారి అభిప్రాయం తీసుకుంటున్నారు. జూన్‌ నెలలో కూడా వీలైనంత మంది అభిమానులను కలవాలని రజనీ భావిస్తున్నారు. ప్రజల నుంచి విపరీతమైన స్పందన, పరిస్థితులు ఆశాజనంగా ఉంటే తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఒరవడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ రాజీకయ పార్టీతోనూ రాజనీ చేతులు కలపరు. కొత్త పార్టీ ప్రణాళికలు గురించి వెలువడే అవకాశం ఉందని అని సత్యనారాయణరావు అన్నారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తమతో చేతులు కలపొచ్చని భాజపా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అవినీతి అంతమొందించేందుకు రజనీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.. ఆయన ఆలోచనలకు భాజపా మాత్రమే సరిపోతుంది అని భాజపా తమిళనాడు అధ్యక్షుడు తమిళసాయి సుందర్‌రాజన్‌ అన్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి రావడంపై అభిప్రాయం తెలుసుకునేందుకే అభిమానులు, శ్రేయోభిలాషులతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే తొలిరౌండ్‌ పూర్తయింది. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆయన యోచిస్తున్నారని గైక్వాడ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే తన రాజకీయ ప్రవేశంపై అధికారికంగా వెల్లడించేకపోయినప్పటికీ.. ఇప్పటికే తమిళరాజకీయాల్లో రజనీకాంత్‌ ప్రటన ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో మంచి రాజకీయ నేతలు ఉనప్పటికీ వ్యవస్థ మాత్రం కుళ్లుపట్టిపోయిందని రజనీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వ్యవస్థను బాగుచేయాల్సిన సమయం ఆసన్నమైందని..అందకు ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆయన ప్రకటించారు. ఇప్పటికే రజనీకాంత్‌ మే 15 నుంచి 19 వరకు జిల్లాల అభిమానులతో సమావేశమయ్యారు. అయితే ఆయన కొత్త సినిమా కాలా కరికాలన్‌ విడుదల పనుల వల్ల అభిమానుల భేటీలకు బ్రేక్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. కాగా తన రాజకీయ ప్రంటనకు ముందు జూన్‌, జూలై నెలల్లో రజనీకాంత్‌, ఇలాంటి మరిన్ని సమావేశాలు నిర్వహించనున్నట్టు సత్యనారాయణరావు గైక్వాడ్‌ వెల్లడించారు.