జాగ్రత్తపడుతున్న సమంత

ఇంతవరకు గ్లామర్‌ పాత్రల్లో మెరిసిన సమంత ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనతాగ్యారేజ్‌ చిత్రం తర్వాత నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగినప్పట్నుంచి పాత్రల ఎంపికలో ప్రత్యేకశ్రద్ధ కనబరచడమే కాదు నటనకు అవకాశం ఉన్న పాత్రలనే అంగీకరించడం మొదలుపెట్టారు. దాంతో ఒక దశలో ఆమెకు సినిమాలు సన్నగిల్లడంతో సమంత కెరీర్‌ ఏమౌతుందోనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఓర్పుతో ముందుకు సాగిన ఆమెకు అవకాశాలపై అవకాశాలొస్తుండటం విశేషం. ఎంచక్కా ఇప్పుడామె చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను చిత్రాలున్నాయి. వాటిలో మూడు తెలుగు చిత్రాలతో పాటు మూడు తమిళ చిత్రాలున్నాయి. మునుపటి కోవలోనే ఒక్కసారిగా ఆమె ఇన్ని చిత్రాలతో బిజీ అయిపోయింది. రాజుగారి గది-2 చిత్రంలో నాగార్జునతో పాటు ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఆమె రామ్‌చరణ్‌, దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందుతున్న చిత్రంలో తనలోని నటనను వెలికితీసే పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. ఇక సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కే చిత్రంలో టైటిల్‌ పాత్రలో కీర్తిసురేష్‌ నటించనుండగా, సమంత చేసే పాత్రపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఆమె చేస్తున్న చిత్రాల సంగతి అలావుంట. ఇక తమిళంలో రూపొందుతున్న విజయ్‌ 61లో విజయ్‌ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తుండగా వారిలో మెయిన్‌ కథానాయికగా సమంత సందడి చేయబోతోంది. అలాగే అనీతికతైగల్‌ చిత్రంలో విజయ్‌సేతుపతి సరసన నటిస్తున్న ఆమె ఇంకోవైపు విశాల్‌ సరసన ఇరుంబుతిరై చిత్రం చేస్తోంది. ఇవన్నీ నటనకు ప్రాముఖ్యం ఉన్న విభిన్నమైన పాత్రలేనట. ముఖ్యంగా ఇరుంబుతిరై చిత్రంలో సమంత పాత్ర చాలా కామెడీతో కూడుకుని ప్రేక్షకులను ఎంతగా అలరింపజేస్తుందని అంటున్నారు. తన కెరీర్‌ మొత్తంమీద ఇప్పటివరకు ఈ తరహా కామెడీని ఆమె ఎప్పుడూ చేయలేదట. అందులో రోబో శంకర్‌తో కలిసి ఆమె పండించే కామెడీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వింపజేస్తుందని అంటున్నారు. మొత్తంమీద సమంత కెరీర్‌లో ఇప్పుడు చేస్త్తున్న చిత్రాల్లోని పాత్రల పరంగా ఇది కొత్త ఇన్నింగ్స్‌గా అభివర్ణిస్తున్నారు.