"జయ జానకీ నాయక" సినిమా రివ్యూ

చిత్రం: జయ జానకీ నాయక
రేటింగ్: 2.5/5.0
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
దర్శకత్వం: బోయపాటి శీను
నిర్మాత : మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్

స్టారింగ్:బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్, ప్రగ్య జైస్వాల్, కేథరిన్ ట్రెసా, జగపతి బాబు, ధన్యా బాలకృష్ణ, ఈస్టర్ నొరోన్హా తదితరులు..

బోయపాటి శ్రీనివాస్ సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్‌కి పండగే. మంచి క్లాస్ హీరోని కూడా ఎమోషనల్ మాస్ హీరోగా చూపించగల సత్తా బోయపాటిది. ‘సరైనోడు’తో ఈ విషయాన్ని బోయపాటి రుజువు చేశారు. తాజాగా బెల్లకొండ శ్రీనివాస్‌ హీరోగా ‘జయ జానకి నాయక’ సినిమాను బోయపాటి తెరకెక్కించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి. బోయపాటి గత చిత్రాల మాదిరిగానే ‘జయ జానకి నాయక’ కూడా మంచి మాస్ మసాలా సినిమా అట. అదిరిపోయే ఫైట్స్, అకట్టుకునే పాటలు, రోమాలు నిక్కబొడిచేలా ఎమోషనల్ సీన్లు. ‘సింహ’, ‘లెజెండ్’, ‘సరైనోడు’ వంటి మాస్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ‘జయ జానకి నాయక’ కచ్చితంగా నచ్చుతుందని ప్రేక్షకులు అంటున్నారు. మరి ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
గగన్(బెల్లంకొండ శ్రీనివాస్) చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసుడు. తన తండ్రి(శరత్ కుమార్), అన్నయ్య(నందు)లతో కలిసి జీవిస్తుంటాడు. గగన్‌కు కాలేజీలో స్వీటీ(రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. స్వీటీ.. గగన్ ఫ్యామిలీకి కూడా దగ్గరవ్వడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. దానికి స్వీటీ తండ్రి జేపీ అంగీకరించడు. తన కూతురిని ప్రముఖ వ్యాపారవేత్త అశ్విత్ నారాయణ(జగపతి బాబు) కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు జేపీ. తండ్రి మాటకు విలువిచ్చే స్వీటీ.. గగన్‌ను దూరం చేసుకుంటుంది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకొని బాధ పడుతున్న గగన్‌కు స్వీటీ వితంతువుగా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది..? స్వీటీ భర్త ఎలా చనిపోతాడు..? తనకున్న సమస్యలను గగన్ పరిష్కరిస్తాడా..? చివరకు గగన్, స్వీటీల జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి..? ఇటువంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డాన్స్, ఫైట్స్ పరంగా బాగా పరిణితి చెందాడు. యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించాడు. అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో శ్రీనివాస్ నటన అంతంత మాత్రంగానే ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. శరత్ కుమార్ తన నటనతో మెప్పించారు. జగపతిబాబు పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది. తరుణ్ అరోరా, నందు, వాణి విశ్వనాథ్ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు.

సాంకేతికపరంగా...
సినిమాటోగ్రఫీ వర్క్ హైలైట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. తన కథనంతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ...
పంతం, పరువు ఈ రెండిటి మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి, తనను కాపాడుకోవడానికి ప్రయత్నించే ఓ యువకుడు మధ్య నడిచే కథే ఈ సినిమా. ఈ ప్రేమ కథ చుట్టూ బోయపాటి స్టైల్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను జోడించి సినిమాగా తెరకెక్కించారు. సినిమాలో లవ్ స్టోరీ కంటే యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. సినిమాకు హైలైట్‌గా నిలిచింది కూడా బోయపాటి శైలి యాక్షన్ సన్నివేశాలే. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్‌తో నింపడం వల్ల క్లాస్ ఆడియన్స్ సినిమాను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే విషయం చెప్పలేని పరిస్థితి. బి, సి ఆడియన్స్‌కు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి బోయపాటి మరోసారి తన స్టైల్ యాక్షన్ సినిమాతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి.

నచ్చినవి...
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు
బెల్లంకొండ శ్రీనివాస్ నటన
రకుల్

నచ్చనివి...
మరీ ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉండటం

చివరగా...
బోయపాటి స్టైల్ ఉన్న మరో యాక్షన్ సినిమా..