జనసేనలోకి కిరణ్‌కుమార్‌రెడ్డి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి జనసేన నుండి పిలుపువచ్చింది. జనసేనలో కిరణ్‌కుమార్‌రెడ్డి చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయన జనసేనలో చేరితే పవన్‌ తర్వాతి స్థానం పార్టీలో ఆయనకు మాత్రమే దక్కే అవకాశం దక్కనుంది. 2019 ఎన్నికల్లో పోటీచేస్తానని జనసేన చీఫ్‌ పవన్‌కళ్యాణ్‌ ప్రకటించారు. గత ఎన్నికల్లో పవర్‌స్టార్‌ టిడిపి బిజెపి కూటమికి మద్దతును ప్రకటించారు.ఈ కూటమికి అనుకూలంగా ఆయన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2014 ఎన్నికల సమయానికే పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని ఏర్పాటుచేశారు. కానీ, ఆ ఎన్నికల్లో పోటీచేయలేదు. కానీ, 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు పవన్‌ వ్యూహరచన చేస్తున్నారు. అనంతపురం జిల్లానుండి పోటీచేయనున్నారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీచేసేందుకు జనసైనికుల ఎంపికను పవన్‌కళ్యాణ్‌ ప్రారంభించారు.రెండు రాష్ట్రాల్లో జనసైనికుల ఎంపిక శిక్షణ శిబిరాలను వేగవంతం చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా తర్వాత పవన్‌ రాజకీయాలపై ఎక్కువగా కేంద్రీకరించే అవకాశాలున్నట్టు జనసేనవర్గాలు చెబుతున్నాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని తమ పార్టీలో చేరాలని జనసేన నుండి ఆహ్వనం అందినట్టు ప్రచారం సాగుతోంది. పవన్‌ పార్టీలో కిరణ్‌కుమార్‌రెడ్డి చేరితే ఆ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాస్టార్‌గా పవన్‌కు అభిమానుల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. కానీ, రాజకీయానుభవం పవన్‌కు తక్కువే. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో ఉన్న అనుభవం కూడ ఆ పార్టీకి కలిసిరావచ్చనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.2014 ఎన్నికల తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడారు. జై సమైక్యాంద్ర పార్టీని ఏర్పాటుచేశారు. పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపారు. ఆ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. కానీ, రాష్ట్రంలో ఎక్కడ కూడ ఆ పార్టీకి ఆశించినమేర స్పందన దక్కలేదు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఏడాదిన్నర క్రితం ఆయన బిజెపిలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఆయన బిజెపిలో చేరలేదు. ఆయన సోదరుడు టిడిపిలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి ఒకరు కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడితో మంతనాలు జరిపారని ఆయన కూడ టిడిపిలో చేరేందుకు సానుకూలంగా సంకేతాలను ఇచ్చారని ప్రచారం సాగింది. తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డినే పవన్‌ పార్టీ ఆహ్వనం అందినట్టు సమాచారం. అయితే గతంలో బిజెపిలో చేరుతారనే ప్రచారం సాగినట్టువంటి ప్రచారామా అనే చర్చకూడ లేకపోలేదు.పవన్‌కళ్యాణ్‌ పార్టీలో కిరణ్‌కుమార్‌రెడ్డి చేరితే ఇద్దరికీ ప్రయోజనమే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. పవన్‌కళ్యాణ్‌ పార్టీకి రాజకీయ అనుభవం ఉన్న నేతలు ప్రస్తుతం లేరు. కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ విప్‌గా, స్పీకర్‌గా పనిచేశారు.అలాంటి నాయకుడు జనసేనలో చేరితే రాజకీయ వ్యూహలకు పనికిరానుంది. ఏ సమయంలో ఏ ఎత్తుగడ వేస్తే రాజకీయంగా ఉపయోగపడనుందనే విషయమై ఆ పార్టీకి పనికిరానుంది. కిరణ్‌కుమార్‌రెడ్డి 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే పవన్‌ పార్టీలో చేరితే మరోసారి రాజకీయంగా ఉనికిలో ఉండే అవకాశం లేకపోలేదు. పవన్‌ తర్వాత పార్టీలో కిరణ్‌కుమార్‌రెడ్డికి స్థానం దక్కే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి పవన్‌ పార్టీలో చేరితే ఇద్దరికీ ప్రయోజనం కలిగే అవకాశాలుంటాయని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.ఏపీ రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి సుమారు 10 శాతానికి పైగా ఓట్లున్నాయి. పవన్‌ అదే సామాజికవర్గానికి చెందినవాడు.కాపులను బిసిల్లో చేర్చుతామని టిడిపి గత ఎన్నికల సమయంలో హమీ ఇచ్చింది. ఈ మేరకు మంజునాథ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్‌ నిర్ణయం ఆధారంగా నిర్ణయం తీసుకొంటామని ప్రకటించింది. 2019 ఎన్నికలకు వైసీపీ ఇప్పటినుండే ప్లాన్‌ చేస్తోంది. త్వరలోనే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. ప్లీనరీ వేదికగా జగన్‌ హమీలను గుప్పించారు. అధికార టిడిపి కూడ వచ్చే ఎన్నికలకు సిద్దమౌతోంది. అయితే బిజెపితో టిడిపి పొత్తు 2019 ఎన్నికల్లో కొనసాగుతోందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఈ తరుణంలో పవన్‌కళ్యాణ్‌ కూడ ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. పవన్‌ వామపక్షాలతో కలిసి పోటీచేసేందుకు సన్నద్దమయ్యారు.