"గాయత్రి" సినిమా రివ్యూ

చిత్రం: గాయత్రి
రేటింగ్: 2.5/5.0
బ్యానర్:శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌
సంగీతం : థమన్
దర్శకత్వం : ఆర్.ఆర్. మదన్
నిర్మాత: అరియానా, వివియానా, విద్యా నిర్వాణ

స్టారింగ్ : మోహన్‌బాబు, విష్ణు మంచు, శ్రియ సరన్, నిఖిలా విమల్, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ తదితరులు

డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోగా, విలన్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ‘గాయత్రి’ మూవీ టీజర్, ట్రైలర్‌లకు రెస్పాన్స్ అదిరిపోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాను ఇప్పటికే పరిశ్రమకు సంబంధించిన కొంత మంది చూడటంతో వారి నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. రెండు విభిన్న పాత్రల్లో మోహన్ బాబు నటి విశ్వరూపాన్ని చూపారని వారి నుండి వినిపిస్తున్న మాట. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే మంచు విష్ణు, శ్రియ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అని తెలుస్తోంది. మరీ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..

కథలోకివెళితే...
దాసరి శివాజీ(మోహన్ బాబు) రంగస్థల నటుడు. తన వాళ్లందరినీ కోల్పోయిన శివాజీ.. ఓ అనాధాశ్రమాన్ని నడిపిస్తుంటాడు. ఆశ్రమాన్ని నడిపించడానికి కావాల్సిన డబ్బుని సంపాదించడం కోసం వ్యాపారస్తులకు, రాజకీయనాయకులకు కోర్టులో పడే శిక్షలను వారి మారువేషంలో వెళ్లి శివాజీ అనుభవిస్తుంటాడు. తద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో గాయత్రి పటేల్(మోహన్‌బాబు) అనే నేరస్థుడి స్థానంలో జైలుకి వెళ్తాడు శివాజీ. అతడికి ఉరిశిక్ష పడిందని తెలియక జైలుకి వెళ్లిన శివాజీ అనుకోకుండా ఇరుక్కుపోతాడు. మరి ఈ కేసు నుండి శివాజీ ఎలా తప్పించుకున్నాడు? అసలు గాయత్రి పటేల్ ఎవరు? అతడికి ఉరిశిక్ష పడడానికి గల కారణాలు ఏంటి? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
మోహన్‌బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. శివాజీ పాత్ర సాధారణంగానే ఉన్నా, గాయత్రి పటేల్ పాత్ర మాత్రం సినిమాకు ప్లస్ అయింది. ఆ పాత్రలో మోహన్ బాబు జీవించేసారు. ఆ పాత్ర పలికే ప్రతి మాట ఆకట్టుకుంటుంది. విష్ణు తెరపై కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
యంగ్ మోహన్‌బాబు పాత్రలో విష్ణు కనిపించడం అభిమానులకు నచ్చుతుంది. శ్రియ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంది. అనసూయ జర్నలిస్ట్ పాత్రలో మెప్పించింది. నిఖిలా విమల్ అమాయకపు అమ్మాయిగా బాగా నటించింది. అలీతో చేయించిన కామెడీ విసిగించింది.

సాంకేతికపరంగా...
ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గ్రాఫిక్స్ వర్క్. తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్ పుట్‌ను తీసుకురాగలిగారు. తమన్ అందించిన పాటల్లో ‘ఒక నువ్వు ఒక నేను’ పాట గుర్తుండిపోతుంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది.సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ...
తండ్రీకూతుళ్ల నేపథ్యంలో సాగే ఈ కథలో కాస్త సెంటిమెంట్ ఎక్కువైందని అనిపిస్తుంది. అయితే కమర్షియల్ అంశాలు ఉండడంతో ప్రేక్షకులకు వినోదానికి లోటుండదు. కథ పరంగా తీసుకున్న జాగ్రత్తలు దర్శకుడు కథనం విషయంలో కూడా తీసుకొని ఉంటే బాగుండేది. సినిమా మొదటి భాగం మొత్తం సాదాసీదాగా నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భావోద్వేగాలతో కూడుకున్నది. ప్రీక్లైమాక్స్ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి. కొన్ని పొలిటికల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గాయత్రి పటేల్ అనే పాత్ర కథలోకి ప్రవేశించిన దగ్గర నుంచి సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండాయి. క్లాస్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానె కనక్ట్ కాగలరు

నచ్చినవి...
డైలాగ్స్
మోహంబాబు నటన
కథ

నచ్చనివి...
స్క్రీన్ ప్లే
కొన్ని సన్నివేశాలలో సాగతీత

చివరగా...
డైలాగ్ కింగ్ డైలాగ్స్ వర్షంలో ఒకసారి తడవచ్చు...