"కాలా" సినిమా రివ్యూ

చిత్రం: కాలా
రేటింగ్: 3.0/5.0
బ్యానర్ : వండర్ బార్ ఫిలింస్
సంగీతం : సంతోష్ నారాయణ్
దర్శకత్వం : పా. రంజిత్
నిర్మాతలు: ధనుష్

స్టారింగ్ : రజినీకాంత్,ఈశ్వరి రావు,హుమా ఖురేషి,సముద్రఖని,నానా పటేకర్ తదితరులు

సూపర్ స్టార్ రజినీకాంత్, పా. రంజిత్ కాంబోలో తెరకెక్కిన ‘కాలా’ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వండర్ బార్ ఫిలింస్ పతాకంపై రజినీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఈ చిత్రానికి మరింత హైప్ వచ్చింది. ఇక గతంలో కబాలి చిత్రాన్ని రూపొందించిన పా. రంజిత్‌కే మరోసారి అవకాశం ఇచ్చారు రజినీ. మరి రజినీ నమ్మకాన్ని పా. రంజిత్ నిలబెట్టాడా? రజినీ పొలిటికల్ ఎంట్రీ తరువాత వచ్చి ‘కాలా’ మూవీకి ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం....

కథలోకివెళితే...
ముంబైలో ధారవి అనే ప్రాంతాన్ని కన్నబిడ్డలా చూసుకుంటాడు కాలా (రజినీకాంత్). అక్కడ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా చలించిపోతాడు. ధారావి ప్రజలు సైతం కాలాను ఓ దేవుడిలా చూస్తుంటారు. కాలా తన కుటుంబంతో కలిసి ధారావిలోనే సంతోషంగా జీవిస్తుంటాడు. అయితే ఆ ప్రాంతాన్ని దక్కించుకోవాలని రాజకీయనాయకుడు హరిదాదా (నానా పటేకర్) ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రాంతంలో ఓ స్మార్ట్ సిటీ నిర్మించాలనేది అతడి కల. కానీ ధారావిలో కాలా ఉన్నంతవరకు అది జరగదని తెలుసుకుంటాడు. దీంతో కాలాతో మాట్లాడడానికి అతడి ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ అతడికి అవమానం జరగడంతో కాలాపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన రాజకీయ పలుకుబడితో ధారవి ప్రజలకు కనీసపు అవసరాలు అందకుండా చేస్తూ కాలాను చంపే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కాలా భార్య స్వర్ణ (ఈశ్వరీరావు), కాలా పెద్దకొడుకు శివన్న చనిపోతారు. అయినవారిని పోగొట్టుకున్న కాలా ఆ తరువాత ఏం చేసాడు? అనేదే మిగిలిన సినిమా.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
రజినీకాంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అతడిపై చిత్రీకరించిన ఎలివేషన్ షాట్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. పరిచయ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాగ్, పతాక సన్నివేశాల్లో రజినీకాంత్‌ను బాగా చూపించారు. వర్షంలో డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. 'క్యారే సెట్టింగా' అనే డైలాగ్ ట్రైలర్‌లో చూసి ఆ సీన్ సినిమాకు ఆకర్షణగా నిలుస్తుందనుకున్నారు కానీ ఆ సీన్‌లో రజినీకాంత్ ఫైట్ చేయకపోవడం అభిమానులను నిరాశ పరుస్తుంది. విలన్ పాత్రలో నానా పటేకర్ పక్కా యాప్ట్. అతడి డబ్బింగ్ కూడా బాగుంది. ఇక హీరో, విలన్ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్లు అభిమానులతో ఈలలు వేయిస్తాయి. రజినీకాంత్ భార్య పాత్రలో ఈశ్వరీరావు నటన బాగుంది. రజినీకాంత్ ను 'మావ మావ' అంటూ పిలుస్తూ తెరపై ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. హుమా ఖురేషి తెరపై అందంగా కనిపించింది. నటన పరంగా కూడా మెప్పిస్తుంది. అంజలి పాటిల్ పాత్రను బాగా రాసుకున్నారు. ధారవిలో ధైర్యవంతురాలైన అమ్మాయిగా బాగా నటించింది. సముద్రఖని పాత్ర దాదాపు సినిమా మొత్తం ఉంటుంది. ఆ పాత్ర ఆడియన్స్‌కు కొత్తగా అనిపిస్తుంది.

సాంకేతికపరంగా...
సాంకేతిక పరంగా సినిమాటోగ్రాఫర్‌ ఒక్కడే మెప్పిస్తాడు. సంతోష్‌ నారాయణ్‌ థీమ్‌ మ్యూజిక్‌ మినహా మరేమీ ఆకట్టుకోదు. ఎడిటింగ్ వర్క్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. వాస్తవికమైన పాత్రలో సూపర్‌స్టార్‌ని చూపించాలనే దర్శకుడి తపన అర్థమవుతుంది కానీ అతని చాకచక్యం, సమయస్ఫూర్తి, నేర్పు చూపించే సన్నివేశాలు సినిమాలో పెద్దగా కనిపించలేదు. సినిమా మొత్తం ఒకే ప్రాంతంలో చిత్రీకరించారు. కాబట్టి కొత్త లొకేషన్స్ చూసే ఛాన్స్ కూడా ఉండదు. అతి తక్కువ బడ్జెట్‌లో సింపుల్‌గా ఈ సినిమాను చిత్రీకరించేశారు.

విశ్లేషణ...
ముంబైలో ధారావి అనే ప్రాంతంలో తమిళనాడు నుండి వలస వచ్చిన ప్రజలు బ్రతుకుతుంటారు. మురికివాడలో పని చేసుకునే వారికి నాయకుడిగా ఎదుగుతాడు కరికాలుడు. ఆ ప్రాంతాన్ని దక్కించుకోవాలని చూసే ఓ అధికారి నుండి కాలా ధారావి ప్రజలను ఎలా కాపాడాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్‌ని సహజత్వానికి దగ్గరగా ఉండే ఒక కథలో చూపించడంమనే ఆలోచన వచ్చినందుకు దర్శకుడు రంజిత్‌ను మెచ్చుకోవాల్సిందే. కానీ
అతడు రాసుకున్న బలమైన పాయింట్‌ను తెరపై అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆవిష్కరించడంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సిందే. రజినీకాంత్ పాత్రని డిజైన్ చేసిన తీరు తెరపై చూపించిన విధానం బాగుంది కానీ కథనంలో తప్పులు దొర్లడంతో ఆడియన్స్‌కు పెద్దగా కనెక్ట్ అవ్వలేరు. ఓవరాల్‌గా రజినీ ఫ్యాన్స్‌కి ‘కాలా’ మాస్ మసాలా ఎంటర్‌టైనర్. ఆయన స్టైల్, డైలాగ్స్, ఫైట్స్‌ని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. తమిళ వాసనలు ఎక్కువగా ఉండటంతో తెలుగు ప్రేక్షకుల్ని ‘కాలా’ పెద్దగా మెప్పించకపోవచ్చు.

నచ్చినవి...
రజనీ కాంత్ స్టైల్, డైలాగ్స్

నచ్చనివి...
ఎడిటింగ్
స్క్రీన్ ప్లే

చివరగా...
ఇది రజనీ మార్క్ సినిమా కాదు...