కార్యకర్తపై బాలకృష్ణ దాడి!!

టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి తన 'చేతివాటం' ప్రదర్శించారు. ఇటీవల తన అసిస్టెంట్‌ను కొట్టి పతాక శీర్షికలకు ఎక్కిన ఆయన తాజాగా మరొకరిపై చేయి చేసుకున్నారు. టీడీపీ కార్యకర్త అయిన తన అభిమాని చెంప చెళ్లుమనిపించారు. బుధవారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన బాలకృష్ణ రాత్రి బస కోసం పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు వచ్చారు. ఆ సమయంలో తన అభిమాన హీరోకు దండవేసి ఫొటో దిగాలని ఆశపడిన ఓ టీడీపీ కార్యకర్త ఉత్సాహంగా ఆయన వద్దకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఒక్కసారిగా ఆ కార్యకర్తపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడు దాడి చేసిన తీరు చూసి అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ కార్యకర్తలు ఆన్‌లైన్‌లో పెట్టారు. విషయం బయటకు రావడంతో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్న సమయంలో బాలకృష్ణ దురుసు ప్రవర్తనతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో అధికార పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. బాలకృష్ణ ఇలా పార్టీ కార్యకర్తలు, అభిమానులపై చేయిచేసుకున్న సంఘటనలు గతంలోనూ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలయ్య ను అభిమానించడం ఎందుకు ఆయన తో దెబ్బలు తినడం ఎందుకని కామెంట్స్ వేస్తున్నారు.