కాగ్నిజెంట్‌లో 6000 మందికి ఉద్వాసన!!

ఆటోమేషన్‌ ప్రభావం ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు భారీగా షాక్‌ ఇస్తోంది. ఐటీ కంపనీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. తాజాగా అమెరికా టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ 6000 మందికి ఉద్వాసన పలకబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 2.3 శాతం ఉద్యోగులను కంపెనీ తీసివేస్తోంది. కొత్త డిజిటల్‌ సర్వీసులోకి మరలే క్రమంలో ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంతో కంపెనీలు ఉద్యోగులకు గుడ్‌బై చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్‌ కూడా ఈ ఏడాది రెగ్యులర్‌ అప్రైజల్‌ సైకిల్‌లో భాగంగా 6000 మందిని తొలగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు ఇది చాలా క్లిష్ట సయమని, ఉద్యోగులు తమకు తాముగా రీస్కిల్‌ చేసుకోలేని పక్షంలో కంపెనీలో కొనసాగడం కష్టతరమని పేర్కొన్నాయి. కాగ్నిజెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 2,56,000 మంది ఉద్యోగులున్నారు. ఒక్క భారతదేశంలోనే 1,88,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఏడది కూడా కాగ్నిజెంట్‌ తన ఉద్యోగుల్లో 1-2 శాతం తగ్గించుకుంది. అయితే ప్రస్తుతం ఎంత మందిని తీసివేస్నున్నది కంపెనీ వెల్లడించనప్పటికీ, సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 6000 మందికి పైగా ఉద్యోగులకు పింక్‌ప్లిప్‌లు ఖాయమని తెలుస్తోంది.