ఓం నమఃశివాయ

మాఘ బహుళ చతుర్ధశినాడే మహాశివరాత్రి. ఈ రోజు భక్తులందరితోపాటు శివారాధకులకు మరింత ప్రీతికరమైన పర్వదినం. మన సంప్రదాయం ప్రకారం ముక్కోటి దేవతలను కొలుస్తుంటాం. వీరిలో అత్యంత ముఖ్యమైన దేవతలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజిస్తుంటాం. వీరిలో అగ్రగణ్యుడు, ఆదిదేవుడుగా పరమశివుడిని గుర్తించి, పూజించి, తరించే దినమే మహాశివరాత్రి.అందుకే మన పర్వదినాల్లో మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనది. ప్రతీ మాసంలోనూ మాసశివరాత్రులు వస్తాయి. కానీ మహాశివరాత్రి ప్రభావం మాత్రం చాలా గొప్పది.

శివరాత్రినాడు పాటించాల్సినవి..
ఈ రోజున ప్రత్యూషకాలంలో స్నానం చేసి, నదీ జలాలతో, శివునికి ప్రీతికరమైన ద్రవ్యాలతో మహాన్యాసంతోపాటు నమకచమకాదులతో, ఏకాదశ రుద్రాభిషేకం చేయాలి. తదనంతరం ఆ శంకరుణ్ణి బిల్వపత్రాలతో ఆర్చించాలి. ఆ రోజున శివనామ ధ్యానం చేస్తూ రాత్రంతా జాగారదీక్ష చేయాలి. ఈ రోజునే కాకుండా నిత్యమూ కూడా శివనామ ధ్యానం చేస్తూ ఉంటే, అదే మనల్ని సక్రమ మార్గాన నడిపిస్తుంటుంది.కాబట్టి అత్యంత శ్రద్ధతో వీలైనంత మేరకు రోజూ ధ్యానం చేయడం మంచిది.జాగార దీక్షను సంకీర్తన, పారాయణ, స్తుతి ప్రార్ధనలతో పూర్తిచేయాలి.

శివరాత్రి మరనాడు ఉదయం మళ్ళీ శివునికి పునఃపూజ చేయాలి.తరువాత యధాశక్తి దానాదులు చేసి, బంధుమిత్రులు, బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి.

"ఏతత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు"
అంటూ శివార్పణ గావించాలి, సాక్షత్తూ పరమశివుడే పార్వతిదేవికి ఈ మహాశివరాత్రి తనకు అత్యంత ప్రీతికరమైనదని చెప్పిన సందర్భాలు పురాణాలలో అనేకం ఉన్నాయి. మహాభారతం శాంతిపర్వంలోనూ, గరుడపురాణం, పద్మపురాణంలోనూ ఈ శివరాత్రి గురించి విపులంగా ఉంది.

ఈ మహాశివరాత్రినాడు శివుడిని లింగాకృతిలో పూజించడంతో పాటు, పార్వతీపరమేశ్వరుల పరిణయదినమని, ఆలయాలలో శివకల్యాణాలు కూడా విశేషంగా జరిపిస్తుటారు.శివరాత్రి నాడు ఉపవాసం, పూజలు, జాగారం మొదలుగునవి ఆచరించినప్పటికీ ముఖ్యంగా శివుడు అభిషేకప్రియుడు, కాబట్టి నమకచమకాదులతో శివుడిని అభిషేకిస్తే ఆ స్వామి సంతోషించి భక్తుల కోరికలను వెంటనే తీర్చుతాడని మన పురాణాలు చెబుతున్నాయి.

త్రిలింగాలతో పాటు (శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం) ఇంకా పంచభూతలింగాలు, జ్యోతిర్లింగాలు, ముఖ్యమైన శైవక్షేత్రాలలో శివరాత్రి ఉత్సవాలు, తిరునాళ్ళు, జాతరలు మొదలుగునవి శివభక్తులందరూ కలిసి ప్రాంతీయ భేదాలు మరిచి ఐకమత్యంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.

శివరాత్రి మహత్యం..
గుణనిధి వృత్తాంతం ద్వారా ఎంతటి పాపియైన శివరాత్రినాడు శివనామములను విని, ఉపవాసం చేసి, శివపూజ చూసి, శివాలయంలో దీపమును వెలిగించినట్లైతే శివానుగ్రహమునకు పాత్రుడౌతాడని తెలుపుతోంది.అలాగే గురుద్రుహుడనే కిరాతకుడు శివరాత్రినాడు మారేడు చెట్టు ఎక్కి అనుకోకుండా నాల్గుయామములందు శివపూజ చూసి, చేతికందిన జింకలను చంపకుండా వదిలిపెట్టి, హింస వదిలిపెట్టినవాడై, తద్వారా శివసాక్షాత్కార భాగ్యం పొందినటువంటి సందర్భం శివరాత్రి మహాత్యాన్ని వివరిస్తుంది.ఈ శివరాత్రి మహత్యముతో పాటు అనేక అద్భుతమైన విషయములను మహేశ్వరుడు, బ్రహ్మ, విష్ణువులకు ఉపదేశించి, ఈ రోజు చేయవలసిన పూజావిధానములు తెలుపుతాడు. ఆ విధంగా బ్రహ్మవిష్ణులిద్దరూ పరమశివుని పూజించిన వారిలో మొదటివారైనారు. ఈ సందర్భంలో వారు ప్రణవము, పంచాక్షారీ మంత్రములు మహత్యములను గురించి శివుని ద్వారా తెలుసుకున్నారు.