ఐటీకి షాక్

డోనాల్డ్ ట్రంప్... తాను అనుకున్నది సాధించారు. భారత ఐటీకి షాకిచ్చారు. విదేశీయులను అమెరికాలో పనిచేసేందుకు అనుమతినిచ్చే హెచ్1బీ వీసా నిబంధనల్లో చేయాల్సిన మార్పుల దస్త్రంపై ఆయన సంతకం పెట్టేశారు. మన కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున సంతకం పెట్టారు. స్థానిక ఉద్యోగాల్లో అమెరికన్ యువతకే పెద్ద పీట వేయాలని స్పష్టంగా చెప్పేశారు. ఆ సంతకం భారత ఐటీ నిపుణులకు శరాఘాతమే. అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించుకుందాం అనుకున్నవారికి పెద్ద షాక్. ఎవరు పడితే వారిని ఇప్పుడు భారత ఐటీ కంపెనీలు అమెరికాకు పంపలేవు. అత్యున్నత నైపుణ్యం ఉన్నవారు మాత్రమే అమెరికాలో అడుగుపెట్టగలరు. ఈ ప్రభావం టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో వంటి అతిపెద్ద ఐటీ కంపెనీలపై భారీగా పడనుంది. అధ్యక్షుడిగా పదవిని చేపట్టాక కేవలం 100 రోజుల్లోనే తన ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా విజయవంతంగా అడుగువేశారు ట్రంప్. ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ నినాదాన్ని అమలు చేశారు.

లాటరీ పద్దతి ద్వారా హెచ్1బీ వీసా ఇచ్చే విధానం సరైనది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికే ఆ వీసాలు ఇవ్వాలని ఆయన తెలిపారు. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్న వ్యక్తే అమెరికాలో అడుగుపెట్టేందుకు అర్హుడు. అయితే శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. అయితే హెచ్1బీ వీసాతో అమెరికా వచ్చే వ్యక్తికి ఇవ్వాల్సిన వేతనాన్ని రెట్టింపు చేయడంతో... ఇతర దేశాల నుంచి ఉద్యోగులను తీసుకునేందుకు పెద్ద కంపెనీలు మొగ్గు చూపడం లేదు. అంతేసి జీతాలు ఇచ్చి విదేశీయులను తెచ్చుకునేకన్నా అమెరికన్లకే ఆ ఉద్యోగలు ఇవ్వాలని అక్కడి చాలా కంపెనీలు భావిస్తున్నాయి. ట్రంప్ కావాల్సిన మార్పు కూడా ఇదే. అమెరికాకు చెందిన ఉద్యోగాలు స్థానిక యువతకే చెందాలన్నది అతని నినాదం.