ఎందరో తండ్రులు అందరికీ వందనాలు...

నేడు ఫాదర్స్ డే

ఆయన...ఓ

ఉగ్రనరసింహుడు.

అగ్నిహోత్రుడు...రుద్రనేత్రుడు.ఆయన కళ్లెర్ర చేస్తే ఇంటిల్లిపాదికీ ఒళ్ళంతా వణుకే.ఆయనకు ఎదురుపడాలన్నా, మాట్లాడాలన్నా అందరికీ 'టెర్రర్'...అసలు ఆయనంటేనే ఓ హంటర్...ఇవన్నీ ఒకప్పుడు 'నాన్న' గురించి 'భయంభయంగా' చెప్పుకునే మాటలు...

సింహంలా గర్జించినా, పులిలా గాండ్రించినా ఆయన ఓ కర్కశుడు కాదు.కుటుంబాన్ని కట్టుబాట్లల్లో, కష్టల్లేని రీతిలో నడపాలన్నదే ఆయన తపన. నాన్నంటే ఓ సింహం, ఓ పులి కానే కాదు..ఆయనో మార్గదర్శి.అందరికీ పెద్ద దిక్కు.నిజానికి నాన్నంటే ఇంటి 'పై కప్పు''...అందుకే తల్లి లాంటి లాలన, తండ్రిలాంటి రక్షణ అన్నారు.పైకి కోపంగా కనిపించినా..కాసింత ప్రేమ కోసం నిలువెల్లా కరిగిపోతాడు నాన్న.బిడ్డల శ్రేయస్సే పరమావిధిగా భావించి ఎన్ని కష్టాలైనా భరిస్తాడు.

పిల్లలపై అమ్మకు ఎంతటి ఆప్యాయతలు, బాధ్యతలున్నాయో అవన్నీ నాన్నకూ ఉన్నాయి.పిల్లలను పెంచడంలో, మమతానురాగాలను పంచడంలో అమ్మ ఎంతగా పరితపిస్తుందో నాన్నకూడా అందులో ఏ మాత్రం తీసిపోడు.ఆయన కసురుకున్నా, కళ్లెర్ర చేసిన అంతరంగం అదే. ఆత్మీయతకు అమ్మ ప్రతిబింబమైతే..అంతులేని వాత్సల్యానికి నాన్న ఓ ప్రతిరూపం.పిల్లల్లో ధైర్యాన్ని నింపి, వారు దర్జాగా బతికేందుకు అనుక్షణం ఆసరా ఇచ్చేది నాన్న.

మారుతున్న కాలంతో పాటు కుటుంబ వ్యవస్థలోనూ అనూహ్య మార్పులు అనివార్యమవుతున్నాయి.నాన్నల వైఖరిలో, ధోరణిలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.గతంలో...సంపాదించడం ఒక్కటే నాన్న ప్రధాన బాధ్యత అన్న భావం ఉండేది.అమ్మ ఇంటికే పరిమితమైతే, నాన్న ఇంటా, బయట కుటుంబం కోసం శ్రమిస్తాడు.పిల్లలకు నడక నేర్పి, నడతను తీర్చిదిద్దడాన్ని ఈ కాలపు నాన్న తన బాధ్యతగా భావించడంలో ఏ మాత్రం వెనుకబడడం లేదు.కుటుంబంలో తన హోదాను, భేషజాలను పక్కన పెట్టి పిల్లల భవిత కోసం నేటి నాన్న ఎంతగానో పరితపిస్తున్నాడు.తన కళ్లతో పిల్లలకు ప్రపంచాన్ని చూపడంలో, తాను కష్టపడుతూ పిల్లల శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం ఆలోచనల్లో సంచరిస్తాడు.పిల్లల్ని సాకడంలో అమ్మకంటే తానేమీ తీసిపోలేదని ఇప్పటి నాన్న నిరూపిస్తున్నాడు.

కుటుంబ నిర్వహణలో అమ్మతోపాటు బాధ్యతలను పంచుకోవడానికి నాన్న పోటీపడుతున్నాడు.వంటపనిలో, ఇంటిపనిలో అమ్మకు చేదోడువాదోడుగా ఉంటూ పిల్లల సంరక్షణలో తన వంతు సహాయం చేసేందుకు నాన్న సంసిద్ధత వ్యకం చేయడం నేడు చాలా ఇళ్లలో చూస్తున్నాం.వంటపనిలో అమ్మ బిజీగా ఉంటే పిల్లల్ని నిద్రలేపడం, స్నానం చేయించడం, వారిని బడికి సిద్ధం చేయడంలోను నాన్న సహకరిస్తున్నాడు.ఒక్కప్పుడు తండ్రి చెంతకు పిల్లలు వెళ్లాలంటే జంకేవారు.ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా లేవు.పిల్లల చదువు, వారి ఆరోగ్యం గురించి తండ్రులు ఎంతో ఆప్యాయంగా ఆరా తీస్తున్నారు.ఉద్యోగం, సంపాదన యావలో ఉన్నా, పిల్లలతో గడిపేందుకు ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు.ప్రతి రోజూ ఏదో సమయంలో పిల్లలను దగ్గరకు తీసుకుని వారితో ప్రేమగా సంభాషిస్తున్నారు. వారాంతపు సెలవుల్లో పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళి వారు అడిగిన వస్తువులను కోనేందుకు నాన్నలు 'ఓకే' అంటున్నారు.పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఎప్పుడైనా కోప్పడడం సహజమే అయినా, వారిని లాలించడంలో, వారి ఇష్టాలను తీర్చడంలో నాన్న ముందంజలోనే ఉంటున్నాడు.పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి గొప్పలకూ పోకుండా భార్యకు సహకరిస్తూ తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు.చదువుల్లో పిల్లల మార్కులు, ర్యాంకుల గురించి ఆరా తీస్తూ వారి భవిష్యత్ కలలను సాకారం చేసేందుకు నాన్న ఎంతగానో ఆలోచిస్తున్నాడు.పరీక్షల సమయంలో అనుక్షణం పిల్లలను సాకూతూ, వారికి ధైర్యాన్ని నూరిపోయడంలో నాన్న చేస్తున్న కృషి తక్కువేమీ కాదు.

ఒకప్పుడు పిల్లలంతా తండ్రి మాటను జవదాటని వారే! ఆధునిక యుగంలో ఆ పరిస్థితి ఎంతో మారింది.పిల్లల మనోభావాలను తెలుసుకుంటూ వారి ఇష్టప్రకారమే అంతా జరగాలని తండ్రులు భావిస్తున్నారు.పిల్లల అభిరుచులు, అభిప్రాయాలను గౌరవించినప్పుడు మేలే జరుగుతుందన్న విషయాన్ని నాన్నలు గ్రహిస్తున్నారు.చదువు విషయంలో గానీ, పెళ్ళి విషయంలో గానీ పిల్లల మనోభావాలను గుర్తించేందుకు తండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఉదయానే నిద్ర లేపి పిల్లల చేత పద్ధతి ప్రకారం చదివించడం, వారి యోగక్షేమాలు విచారించడం, పరీక్షలు రాసేందుకు ధైర్యం ఇస్తూ వారిని పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువెళ్ళడం, మంచి మార్కులొస్తే అభినందించడం, తక్కువ మార్కులొస్తే ధైర్యం చెప్పడం, వారి ఇష్టప్రకారం అనువైన కోర్సులు చదివించడం, అనుకున్న ఉద్యోగం దక్కేలా ప్రోత్సహించడం, యుక్తవయసుకొచ్చి ప్రేమలో పడితే నిండుమనుసుతో అంగీకరించడం, నచ్చిన వారితో పెళ్ళి జరిపించడం...ఈ బాధ్యతలన్నీ తండ్రులు నేడు మనస్పూరిగా నిర్వహిస్తున్నారు.పిల్లల చేత ఇష్టంలేని పనులు చేయించాలని తల్లిదండ్రులు భావించకపోవడం...కుటుంబ వ్యవస్థలో ఇటీవల కాలంలో వచ్చిన పెనుపరిణామం.ఇలాంటి మార్పులే కుటుంబ వ్యవస్థ మరింతగా బలపడడానికి, మమతానురాగాలు వెల్లివిరియడానికి దోహదం చేస్తాయి.

తాము అడిగినవన్నీ ఇచ్చేస్తూ తమ కోర్కెలను తీర్చేందుకు నాన్న ఓ 'ఎటిఎం' కాదన్న వాస్తవాన్ని నేటి పిల్లలు సైతం గ్రహించాలి.తాము కూడా నాన్న పట్ల బాధ్యత వహించాలి.'సక్సెస్ ఫుల్ ఫాదర్ ' అని నిరూపించేందుకు నాన్న ఎంతగా పరితపిస్తున్నాడో, పిల్లల్లు అంతగా తపన చెందాలి.మంచి ఉద్యోగం వచ్చాక 'రెక్కలొచ్చిన పక్షి ' మాదిరి నేడు ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులకు దూరమవుతున్నారు.ఉద్యోగం, సంపాదన, తన కుటుంబం...అని గిరి గీసుకుంటూ..తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నవారు ఎందరో ఉన్నారు.కొందరైతే మరీ కఠినంగా..వయోభారం పెరిగిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు.అమెరికాలోనో, ఇంకెక్కడో ఉద్యోగాలు వెలగబెడుతూ సొంతగడ్డ పై పేరెంట్స్ ను మరిచిపెతున్నారు.ఇది మంచిది కాదని ఎవరైనా ఆప్తులెవరైనా అంటే 'డబ్బు పంపుతున్నాం కదా..వృద్ధాశ్రమాల్లో అన్నీ ఏర్పాటూ చేసాం కదా..' అని కొందరు పుత్రరత్నాలు చెబుతుంటారు.అప్యాయతలు, అనురాగాలు డబ్బుతో కొనలేమని వారు తెలుసుకోలేకపోతున్నారు.తాము వృద్ధులమైనప్పుడు తమ పరిస్థితి కూడా ఇంతే కదా! అన్న నగ్న సత్యాన్ని కొందరు విస్మరిస్తున్నారు.ఆస్తిపాస్తులను, అనురాగాన్ని పంచిన అమ్మానాన్నలను అలక్ష్యం చేస్తే భవిష్యత్తులో అలాంటి వేదనలే ఎదురవుతాయని వారు అనుకోవడం లేదు.

జీవితాన్ని, బంగారు భవిష్యత్తును తమకు ప్రసాదించిన నాన్న సేవలను గుర్తు చేసుకోవడానికి 'ఫాదర్స్ డే' అంటూ మొక్కుబడిగా ఒకరోజు ఏదో హడావుడి చేస్తే చాలదు.నాన్న ఆప్యాయతను గుర్తు తెచ్చుకోవడానికి, ఆయనకు సేవ చేయడానికి ఏడాదిలో ఎన్ని రోజులున్నా చాలవు.'ఫాదర్స్ డే' పేరిట సందడి చేయడం కొన్ని విదేశాల్లో మొదలైనా, ఆ సంప్రదాయం మన దేశంలోనూ ఇటీవలి కాలంలో వేలం వెర్రిలా మొదలైంది...నాన్న అంతరంగాన్ని చదివి, ఆయనకు అన్ని విధాలా ఆనందం కలిగించడం పిల్లల కనీస కర్తవ్యం.