"ఎంఎల్ఏ" సినిమా రివ్యూ

చిత్రం: ఎంఎల్ఏ
రేటింగ్: 2.0/5.0
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్

స్టారింగ్ : కళ్యాణ్ రామ్,కాజల్ అగర్వాల్,మనాలి రాథోడ్,బ్రహ్మానందం,లాస్య,పోసాని,రవి కిషన్

పటాస్, ఇజం సినిమాల తర్వాత కొంతకాలం పాటు బ్రేక్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఒక కొత్త కథనంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఆయన నటించిన ‘ఎంఎల్ఏ’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.‘ఎంఎల్ఏ’ అనే పదానికి కొత్త అర్ధం చెప్పడంలో ఎంతవరకు ఆయన సక్సెస్ అయ్యారో మరి రివ్యూలో తెలుసుకుందాం!

కథలోకివెళితే...
కళ్యాణ్(కళ్యాణ్ రామ్)ను అందరూ మంచి లక్షణాలున్న అబ్బాయి(ఎంఎల్ఏ) అని పిలుచుకుంటుంటారు. తన చెల్లిని ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేసి వాళ్లతోనే కలిసి బెంగళూరులో ఉంటాడు కళ్యాణ్. అక్కడ ఇందు(కాజల్ అగర్వాల్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇందు తన బాస్ కూతురని తెలుసుకొని షాక్ అవుతాడు. అయినా తన మీద ఇష్టం మాత్రం పోదు. ఒక ల్యాండ్ విషయంలో ఇందుకి సహాయం చేసి ఆమెను ఇంప్రెస్ చేస్తాడు. అదే ల్యాండ్‌లో భూమి పూజ జరుగుతున్న సమయంలో ఇందుని బలవంతంగా కొందరు వ్యక్తులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వారి నుంచి ఇందుని కాపాడుకున్న కళ్యాణ్‌కు ఆమె తన బాస్ కూతురు కాదని, కావాలనే ఆమె స్థానంలోకి వచ్చిందని తెలుస్తుంది. ఇంతకీ ఇందు ఎవరు? ఆమె కథ ఏంటి? ఆమె కారణంగా కళ్యాణ్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
కళ్యాణ్ రామ్ తన హీరోయిజం, నటనతో పాత్రను పండించారు. మంచి శరీర ఆకృతితో కళ్యాణ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్ అన్నీ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. కాజల్ తెరపై చాలా అందంగా కనిపించింది. విలన్ పాత్రలో రవికిషన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ కామెడీ పండింది. చాలా కాలం తరువాత బ్రహ్మానందం. పట్టాబి అంటూ గుర్తుండిపోయే పాత్రలో నటించారు. సినిమాకు బ్రహ్మీ నటన ప్లస్ అయింది.

సాంకేతికపరంగా...
సినిమాలో పాటల కంటే నేపథ్య సంగీతం మరింత మెప్పిస్తుంది. మణిశర్మ మరోసారి తన మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. సినిమాను మరీ సాగదీయకుండా జాగ్రత్త పడ్డారు

విశ్లేషణ...
విలన్ హీరోయిన్‌ను ప్రేమిస్తాడు.. ఆమెను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ సీన్‌లోకి హీరో ఎంటరై హీరోయిన్‌ను దక్కించుకుంటాడు. ఈ క్రమంలో ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కబెడతాడు. ఇదే స్టోరీ లైన్‌తో తెలుగులో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ‘ఎంఎల్ఏ’ కూడా అదే కోవకు చెందుతుంది. కథలో ఎక్కడా కొత్తదనం ఉండదు. అయితే బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలనే చిన్న పాయింట్‌ను దర్శకుడు ఈ కథకు జోడించి కొత్తదనం చూపించాలనుకున్నారు. పక్కా కమర్షియల్ మాస్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ ‘ఎంఎల్ఏ’ కనెక్ట్ అవుతాడు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు పెదవి విరవడం ఖాయం.

నచ్చినవి...
కల్యాణ్ రాం నటన
కాజల్ అందాలు

నచ్చనివి...
రోటీన్ కథ

చివరగా...
పరవాలేదు....