"ఇంటిలిజెంట్" సినిమా రివ్యూ

చిత్రం: ఇంటిలిజెంట్
రేటింగ్: 1.5/5.0
బ్యానర్:సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ (ప్రై) లిమిటెడ్
సంగీతం : థమన్
దర్శకత్వం : వి.వి.వినాయక్
నిర్మాత: సి.కళ్యాణ్

స్టారింగ్ : సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, దేవ్ గిల్, వినీత్ కుమార్ తదితరులు

వరుసగా తన గత నాలుగు సినిమాలు పెద్ద డిజాస్టర్లు కాగా ఈసారి మన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ , వి.వి.వినాయక్ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్‌తో సినిమాతో చాలా "ఇంటిలిజెంట్" గా మన ముందుకు వచ్చాడు . ఇంకేంటి తన సినిమా హిట్టు గ్యారంటీ అని అనుకున్నాడు తేజూ. వినాయక్ లాంటి సీనియర్ డైరెక్టర్‌తో సినిమా చేయడం తన అదృష్టమని కూడా అన్నాడు. ‘ఇంటిలిజెంట్’ హిట్టు ఖాయమని వినాయక్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం నమ్మకంగా ఉంది. కానీ తేజూ హిట్టు కొట్టాడా లేదా ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
తేజు(సాయిధరమ్ తేజ్)కి చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్‌గా ఉండడం అలవాటు. ఎవరికైనా మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తి నందకిషోర్(నాజర్)ని గురువుగా భావిస్తుంటాడు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుంటాడు. పెరిగి పెద్దయిన తరువాత నందకిషోర్ కంపెనీలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరతాడు. నందకిషోర్ కూతురు సంధ్య(లావణ్య త్రిపాఠి), తేజు ప్రేమించుకుంటారు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితాల్లోకి మాఫియా డాన్ విక్కీభాయ్(రాహుల్ దేవ్) ప్రవేశిస్తాడు. నందకిషోర్ కంపెనీని తన పేరు మీద రాయించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు విక్కీభాయ్. ఈ క్రమంలో నందకిషోర్‌ను చంపేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసి కంపెనీని విక్కీభాయ్ సొంతం చేసుకుంటాడు. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? తన గురువును చంపిన విక్కీభాయ్ మీద తేజు ఎలా పగ తీర్చుకున్నాడు? చివరకు కంపెనీ ఎవరికి దక్కుతుంది? అనేదే సినిమా.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
మెగాస్టార్ సాంగ్ ‘చమక్ చమక్ చామ్’ పాటను రీమిక్స్ చేసి చాలా పెద్ద తప్పు చేశారనిపిస్తుంది. పాటలో నటీనటుల కాస్ట్యూమ్స్, డాన్స్ ఆ పాట స్థాయిని తగ్గించాయనిపిస్తుంది. ఇకనైనా సాయిధరమ్ తేజ్.. మెగాస్టార్ పాటలను రీమిక్స్ చేయకపోవడం బెటర్. పెర్ఫార్మన్స్ పరంగా తేజు ఆకట్టుకున్నాడు. నటుడిగా తన స్కిల్స్‌ను బాగానే ప్రెజంట్ చేశాడు. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ కేవలం పాటలకు పరిమితం చేశారు.విలన్ పాత్రల్లో కనిపించిన దేవ్ గిల్, రాహుల్ దేవ్ బాగానే నటించారు.

సాంకేతికపరంగా...
థమన్ అందించిన నేపథ్య సంగీతం ఒకరకంగా సినిమాకు కలిసొచ్చే అంశం. పాటల కంటే నేపథ్య సంగీతమే బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ...
నిజానికి సినిమాలో కొత్తగా ఏమీ లేదు. సాఫ్ట్‌వేర్ కంపెనీను దక్కించుకోవాలని చూసే మాఫియా డాన్, అతడిని అంతం చేసి కంపెనీని కాపాడడం కోసం హీరో చేసే ఫీట్లు ఇదే సినిమా. ఇక్కడ దర్శకుడు వినాయక్ కావడంతో కనీసం కథ కూడా వినకుండా సినిమా చేశాడా? అనే సందేహాలు కలుగుతాయి. కథ ఎలాగూ లేదు పోనీ కథనాన్నైనా బాగా నడిపంచారా అంటే అదీలేదు. ఈ విషయంలో వినాయక్ పూర్తిగా విఫలమయ్యారు. కామెడీ, రొమాన్స్ ఏ ఒక్క అంశం ఆకట్టుకోదు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు.వరుస ఫ్లాపులతో డీలాపడ్డ సాయిధరమ్ తేజ్‌ను ఈ సినిమా కూడా నిరాశ పరచడం ఖాయం.

నచ్చినవి...
నేపథ్య సంగీతం

నచ్చనివి...
కథ
కథనం
స్క్రీన్ ప్లే

చివరగా...
సాయిధరమ్ తేజ్‌ ఖాతలో ఇంకో డిజాస్టర్