ఆ పుస్తకంలో ఏముంది?....

పోరాటయాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో ఒక పుస్తకం గురించి చెబుతుండటం చర్చనీయాంశమైంది. ఆ పుస్తకం లో ఏముంది?... ఆ బుక్ చూపిస్తూ అక్కడి నాయకులను ప్రశ్నిస్తున్న పవన్ కు ఆ బుక్ లో ఏం దొరికింది అన్నది గమనిస్తే దాని వెనుక ఆసక్తికరమైన నేపథ్యం కనిపించింది.

ఉద్దానం, ఉత్తరాంధ్ర లోని సమస్యలను గత పన్నెండేళ్లుగా రాస్తున్న నారాయణ మూర్తి బల్లెడ అనే రచయిత, నాటక కర్త వ్యాసాలను ప్రచురించాలని ఉద్దానం యువత అనుకున్నారు. దానికోసం కొంతమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు కలసి ఉద్దానం ప్రచురణలు పేరిట పుస్తకం తెచ్చారు. దానికి ఉద్దానం -కళింగాంధ్ర వ్యాసాలు అని పేరు పెట్టారు. అందులో ఉద్దానం తో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కలసి ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలను సూటిగా ఫొటోలతో సహా సచిత్రంగా ప్రస్తావించారు. అలా అని పెద్ద గ్రంథమేమి కాదు. అంతా కలపి 150 పేజీలకు మించి లేదు.

ఆ పుస్తకమే ఇపుడు పవన్ చేతికి వెళ్లి పాశుపతాస్త్రం అయింది. దాంతో పవన్ పుస్తకం చూపిస్తూ ఇందులో ఉన్న ఒక్క సమస్యను పరిష్కరించినా నాలాంటి వాళ్ళ అవసరం రాదు కదా అని అక్కడి నేతలను నిలదీస్తున్నారు.