ఆత్మహత్య చేసుకున్న ఆధ్యాత్మిక గురువు...

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు తన ఆశ్రమంలో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు, ఎన్సీపీ నేత శరద్‌పవార్ లాంటి రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈయనపై చాలా గౌరవం. మధ్యప్రదేశ్‌కు చెందిన భయ్యూ మహారాజ్‌ (50) మంగళవారం ఇండోర్‌‌లోని తన ఆశ్రమంలో మంగళవారం నాడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయణ్ని ఇండోర్‌లోని బాంబే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మహత్యకు కారణాలేంటనే విషయం పూర్తి దర్యాప్తు అనంతరమే తేలుతుందని ఇండోర్‌ కలెక్టర్‌ నిషాంత్‌ వార్వేడ్‌ పేర్కొన్నారు. ‘ఎవరో ఒకరు నా కుటుంబ బాధ్యతలను చేపట్టాలి. తీవ్ర ఒత్తిడి వల్లే నేను వెళ్లిపోతున్నా’ అని భయ్యూ పేర్కొన్నట్లుగా ఉన్న ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భయ్యూ మహరాజ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన అసలు పేరు ఉదయ్ సింగ్ దేశ్‌ముఖ్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో భయ్యూకు విశేష జనాదరణ ఉంది. గత ఏప్రిల్‌లో ఐదుగురు ఆధ్యాత్మిక గురువులతో నర్మదా పరిరక్షణ కమిటీని ఏర్పాటుచేసిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వీరికి మంత్రుల హోదాను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. వారిలో భయ్యూ కూడా ఉన్నారు. అయితే ఆ హోదాను ఆయన తిరస్కరించారు. ఇక అవినీతికి వ్యతిరేకంగా 2011లో అన్నాహజారే చేపట్టిన నిరాహార దీక్షను విరమింపజేయడానికి నాటి యూపీయే ప్రభుత్వం భయ్యూనే దూతగా పంపింది. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన సద్భావన ఉపవాస దీక్షకు కూడా ఈ ఆధ్యాత్మిక గురువును ఆహ్వానించారు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవిస్‌, శరద్‌ పవార్‌, ఉద్ధావ్‌ఠాక్రే, రాజ్‌ఠాక్రే, బాలీవుడ్ గాయనీమణులు లతా మంగేష్కర్‌, ఆశా భోంస్లే తదితరులు ఆయనకు అభిమానులే. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించిన భయ్యూ, అనంతరం ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అనేక మంది అనుచరులను సంపాదించారు. ఆయన మొదటి భార్య 2015 నవంబరులో మరణించడంతో గతేడాది డాక్టర్‌ ఆయుషి శర్మను మళ్లీ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే భయ్యూ తనను మోసం చేశారంటూ ఓ మహిళ ఆయనపై ఆరోపణలు గుప్పించారు. ఆయన గతంలో రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్‌ పటేల్‌ తదితరులు పరామర్శించారు.

భయ్యూ మహారాజ్‌ ఎప్పుడూ మెర్సిడెస్‌లోనే ప్రయాణిస్తూ, రోలెక్స్‌ వాచీ ధరించేవారు. ఇక ఇండోర్‌లో ఆయనకు విశాలమైన భవంతి ఉంది. భయ్యూ ఆత్మహత్యకు పాల్పడటం పట్ల ఆయన అనుచరులంతా విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందిస్తూ... సంస్కృతి, జ్ఞానం, నిస్వార్థ సేవా సంగమం కలిగిన ఓ వ్యక్తిని దేశం కోల్పోయిందని పేర్కన్నారు. భయ్యూ ఆత్మహత్యపై మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఆధ్యాత్మిక గురువు కంప్యూటర్ బాబా విచారం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా బాధాకరం.. ఆయన ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు.. దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది.. ఏం జరిగిందో అర్థం కావడంలేదని’ అన్నారు.