"అజ్ఞాతవాసి" సినిమా రివ్యూ

చిత్రం: అజ్ఞాతవాసి
రేటింగ్: 2.0/5.0
సంగీతం : అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం : త్రివిక్రం శ్రినివాస్
నిర్మాత: రాధాకృష్ణన్

స్టారింగ్ : పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్, ఆది, కుష్బు, రావురమేష్ తదితరులు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో ‘అజ్ఞాతవాసి’ మూవీ ఈరోజు (జనవరి 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పవన్ మూవీ వస్తుందంటే కలెక్షన్స్ సునామీ మొదలు కాబోతుందని ఫిక్స్ అయిపోతుంటారు ఆయన ఫ్యాన్స్. ఇక పవన్ కెరియర్‌లో ‘అత్తారింటికి దారేది’, ‘జల్సా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మూవీ వస్తుందంటే ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ అంచనాలకు తగ్గట్లు గానే ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఉందంటూ ఓవర్సీస్ నుండి టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే యూఎస్‌లో పలుచోట్ల ఈ మూవీ స్పెషల్ షోలు పడ్డాయి. దీంతో ‘అజ్ఞాతవాసి’ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తుండగా, ప్రపంచ వ్యాప్తంగా ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్ కోసం అటు పవన్ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా అభిమానులను ఎంతగా అలరించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథలోకివెళితే...
గోవింద భార్గవ్(బొమన్ ఇరానీ) పెద్ద పారిశ్రామిక వేత్త. భార్య ఇంద్రాణి(ఖుష్బూ), కొడుకుతో కలిసి జీవిస్తుంటారు. గోవింద కంపెనీని దక్కించుకోవాలనే పంతంతో ఆయన్ని, ఆయన కొడుకుని చంపి ఆస్తికి వారసులు లేకుండా చేస్తాడు సీతారామ్(ఆది పినిశెట్టి). దీంతో కుటుంబానికి దూరంగా పెరుగుతున్న తన భర్త మొదటి భార్య కొడుకు అభిషిక్త్ భార్గవ్(పవన్ కళ్యాణ్)ను ఇంద్రాణి పిలిపిస్తుంది. తండ్రి కంపెనీలోనే ఉద్యోగిగా చేర్పిస్తుంది. తన తండ్రిని, తమ్ముడిని చంపిన వారెవరో తెలుసుకొని వారిని అంతం చేయాలని అభిషిక్త్ నిర్ణయించుకుంటాడు. మరి అభిషిక్త్ తన పగను తీర్చుకున్నాడా? అసలు అభిషిక్త్ కుటుంబానికి దూరంగా పెరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తన సవతి తల్లి కోసం అభిషిక్త్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
పవన్ కళ్యాణ్ పరిచయ సన్నవేశం సినిమాకే హైలైట్. కేవలం యాక్షన్, రొమాన్స్, కామెడీలే కాకుండా భావోద్వేగ సన్నివేశాల్లోనూ పవన్ అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు. పవన్ మేనరిజమ్స్, డాన్స్ మూమెంట్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ను మిక్స్ చేస్తూ వదిలిన ‘కొడకా కోటేశ్వరరావు’ సాంగ్‌కి అభిమానులు థియేటర్‌లో గంతులేయకుండా ఉండడం చాలా కష్టం. రావు రమేష్, మురళి శర్మ కామెడీ కాంబోతో కలసి పవన్ చెలరేగిపోయారు. ఇక యాక్షన్ సీన్స్‌లో తన ట్రేడ్ మార్క్ స్టయిల్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. సీనియర్ నటి ఖుష్బూ వంక పట్టలేని విధంగా నటించారు. సినిమాలో పవన్ తరువాత ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఈమెదే. అయితే ఆమె పాత్రను మరింత హైలైట్ చేసి ఉంటే బాగుండేది. కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్‌లకు అంత ప్రాధాన్యత లేదు. ఉన్నంతలో బాగా చేశారు. తెరపై ఇద్దరూ అందంగా కనిపించారు. వెన్నెల కిషోర్ పాత్రను కామెడీ కోసం ఇరికించినా, తనదైన నటనతో నవ్వించాడు. బొమన్ ఇరానీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికపరంగా...
అనిరుధ్ అందించిన పాటలను తెరపై కూడా అందంగా చూపించారు. నేపథ్య సంగీతం బాగానే ఉంది. మణికందన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను కాస్త సాగదీసినప్పటికీ అభిమానులు బాగానే ఎంజాయ్ చేస్తారు. త్రివిక్రమ్ అంటే డైరెక్టర్‌గా కంటే రచయితగానే ముందు గుర్తొస్తారు. అయితే ఈ సినిమాలో తన కలానికి పెద్దగా పనిచెప్పలేదు.

విశ్లేషణ...
ఈ సినిమాతో అభిమానులకు ‘తమ్ముడు’,‘ఖుషీ’ సినిమా రోజుల్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తారు. పవన్ ఎనర్జీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు.క్లైమాక్స్ సీన్‌లో కంటతడి పెట్టుకుంటూ ‘నీకు నేను ఉన్నాను అమ్మ.. నీతో నేను ఉంటాను’ అంటూ పవన్ కళ్యాణ్ తనలోని నటుడిని పూర్తి స్థాయిలో చూపించారు. తొలి భాగంపై పట్టుకోల్పోయిన త్రివిక్రమ్, సెకండ్ హాఫ్‌లో మాత్రం తన మార్క్ చూపించారు. అయితే ఎమోషనల్ టచ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. సవతి తల్లి, కొడుకుల మధ్య అనుబంధాన్ని ఇంకాస్త బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. మొత్తానికి పవన్ త్రివిక్రమ్ మార్క్ ఉన్న సినిమాను మళ్ళీ చూడవచ్చు.

నచ్చినవి...
పవన్ నటన
సంగీతం
స్క్రీన్ ప్లే

నచ్చనివి...
తొలి భాగంలో సాగతీత
ఎడిటింగ్

చివరగా...
ఈ "అజ్ఞాతవాసి" బాగున్నాడు...