Events

డల్లాస్‌లో ‘మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా’ Published date: Saturday, January 24, 2015 - 05:34

అమెరికాలోని డల్లాస్‌లో మహాత్ముడికి నివాళిగా ‘మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా’ ఏర్పాటైంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది డల్లాస్‌లో మహాత్ముడి నివాసం‌గా పేర్కొనవచ్చు. ఈ ప్లాజా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అనేక సమావేశాలు, ఆలోచనలు పంచుకోవడంతోపాటు శాంతి ర్యాలీ కూడా జరిగింది. ఐదు సంవత్సరాల కఠోర శ్రమతో డల్లాస్‌లోని ప్రవాస భారతీయులు ఈ ‘మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా’కు రూపకల్పన చేశారు. అమెరికాలో భారతీయ వాణిని వినిపించడానికి ఈ ప్లాజా ఒక కేంద్రంగా వుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కువైట్‌లో ఎన్టీఆర్‌కి నివాళులు Published date: Saturday, January 24, 2015 - 05:33

మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్.టి.ఆర్. 19వ వర్ధంతి కార్యక్రమం కువైట్‌లోని తెలుగుదేశం నాయకులు నిర్వహించారు. కువైట్‌లోని ఒమెరెయ పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్‌కి నివాళులు అర్పించారు.

లండన్‌లో ‘తాల్’ సంక్రాంతి వేడుకలు Published date: Saturday, January 24, 2015 - 05:32

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దక్షిణ లండన్‌లోని బ్రోమ్లేలో జరిగిన ఈ వేడుకలలో బ్రిటన్‌లో నివసిస్తున్న అనేకమంది తెలుగువారు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలలో భాగంగా జరిపిన బొమ్మల కొలువులు, ముగ్గుల పోటీలలో ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న లావణ్య కవర్తపు, సునీల్ గంధం, ఆషా పెద్దు, వేణు, ప్రవీణ్, అరుణ్, భాను, నవీన్, సుందరం, భారతి, వందన, సునీల తదితరులను తాల్ ఛైర్మన్ ధర్మవతి నిష్టల అభినందించారు.

డెట్రాయిట్‌లో సంక్రాంతి వేడుకలు Published date: Saturday, January 24, 2015 - 05:31

సంక్రాంతి వేడుకలలో భాగంగా అమెరికాలోని డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్ (డిటిఎ) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. నొవై వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో 30 మందికి పైగా ప్రవాస తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీలలో మొదటి బహుమతిని మల్ల పద్మ, కూన శారద జట్టు గెలుచుకుంది. రెండో బహుమతిని ఆకెళ్ళ శిరీష, దొంతి దివ్య జట్టు, మూడో బహుమతిని నంబూరి సుభాషిణి, ధేనువకొండ జయ జట్టు గెలుచుకున్నాయి. నాలుగో బహుమతిని అకినేపల్లి నాగజ్యోతి, రమ్య రత్నాకర్ జట్టు, ఐదో బహుమతిని పసుపులేటి సురేఖ, జలిగమ కవిత జట్లు దక్కించుకున్నాయి.

అమెరికా బే ఏరియాలో సంక్రాంతి సంబరాలు Published date: Saturday, January 24, 2015 - 05:30

విదేశాలలో వున్న తెలుగువారు సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు లాంటి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారు జరుపుకున్నారు. అమెరికాలోని బే ఏరియాలోని ప్రవాసాంధ్రులు కూడా సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. బే ఏరియాలో స్థిరపడ్డ తెలుగువారంతా ఒకచోట చేరి తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. మహిళలు ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.